గెస్ట్ లెక్చరర్ల సమస్యల పరిష్కారానికి కృషి : ప్రొఫెసర్ కోదండరాం

గెస్ట్ లెక్చరర్ల సమస్యల పరిష్కారానికి కృషి :	ప్రొఫెసర్ కోదండరాం

ముషీరాబాద్,వెలుగు: రాష్ట్రంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లోని గెస్ట్ లెక్చరర్ల  సమస్యలను సర్కార్ దృష్టికి తీసుకెళ్లి  పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలంగాణ జన సమితి పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం హామీ ఇచ్చారు. శనివారం బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర డిగ్రీ గెస్ట్ లెక్చరర్ల అసోసియేషన్ రాష్ట్ర కమిటీ సదస్సు జరిగింది. ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ కోదండరాం హాజరై మాట్లాడుతూ.. పేద విద్యార్థులకు ఉన్నతవిద్య అందాలంటే లక్ష్యంతో మాజీ సీఎం వైఎస్ఆర్  ఫీజు రీయింబర్స్ మెంట్  అమలు చేయగా.. ఎంతోమంది పేద విద్యార్థులకు  ఉన్నతమైన విద్య అందిందని గుర్తు చేశారు. 

ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో మంచే  జరుగుతుందని పేర్కొన్నారు. గత పదేండ్లలో సీఎం ఇంటికి పోతేనే కేసులు పెట్టిన సందర్భాలు ఉన్నాయని, ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేవని చెప్పారు. డిగ్రీ లెక్చరర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కొర్ర ఈశ్వర్ లాల్, అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ బగ్గు నాయక్, శంకరయ్య, వెంకట్, గణేష్, నవీన్, మౌనిక, మహిళా అధ్యక్షురాలు జ్యోతి పాల్గొన్నారు.