
పద్మారావునగర్/ముషీరాబాద్/చేవెళ్ల, వెలుగు : హెచ్ఐవీ పేషెంట్లపై వివక్ష చూపొద్దని గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ ప్రొఫెసర్ రాజారావు సూచించారు. వరల్డ్ ఎయిడ్స్ డే సందర్భంగా శుక్రవారం గాంధీ హాస్పిటల్లోని ఓపీ బ్లాక్ ఏఆర్టీ సెంటర్లో మెడిసిన్స్ వాడకం, పౌష్టికాహార అంశాలపై హెచ్ఐవీ బాధితులకు డాక్టర్లు అవగాహన కల్పించారు. రాష్ట్రంలోనే మొదటిసారిగా హెచ్ఐవీ ఉన్న బాలింతల కోసం బ్రెస్ట్ ఫీడింగ్ కార్నర్ రూమ్, కౌన్సెలింగ్ కేంద్రాలను గాంధీ ఆస్పత్రిలో సూపరింటెండెంట్ రాజారావు ప్రారంభించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. గాంధీ ఆస్పత్రిలో ఇప్పటివరకు 18,262 మంది హెచ్ఐవీ బాధితులు రిజిస్ర్టేషన్ చేసుకున్నారని, ఇందులో 13, 289 మందికి ఇంకా ఏఆర్టీ (యాంటీ రెట్రో వైరల్ థెరపీ) ద్వారా మందులను అందజేస్తున్నామన్నారు. హెచ్ఐవీ పాజిటివ్ ఉన్న గర్భిణులకు గాంధీలో వైద్య పరీక్షలు, డెలివరీ చేస్తున్నామని ఆయన తెలిపారు. ఎయిడ్స్ డే సందర్భంగా హెచ్ఐవీ పేషెంట్లకు గాంధీలో రంగోళీ, మెహందీ పోటీలను నిర్వహించి విజేతలకు ప్రైజ్ లు అందజేశారు. కార్యక్రమంలో ఏఆర్టీ సెంటర్ నోడల్ ఆఫీసర్, ప్రొఫెసర్ డాక్టర్ ఎ. వినయ్శేఖర్, ఆర్ఎంవో డా. జయకృష్ణ, డా. అంబుజా పాల్గొన్నారు.
కాకా అంబేద్కర్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ
వరల్డ్ ఎయిడ్స్ డే సందర్భంగా శుక్రవారం బాగ్ లింగంపల్లిలోని కాకా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విద్యాసంస్థలకు చెందిన ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో మూడు యూనిట్ల స్టూడెంట్లు అవగాహన ర్యాలీ తీశారు. కాలేజీ నుంచి సుందరయ్య పార్క్ వరకు వెళ్లి ఎయిడ్స్ వ్యాధి నిర్మూలనపై నినాదాలు చేసి ప్రజలను చైతన్య పరిచారు. మహమ్మారి బారిన పడకుండా ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ర్యాలీలో ఇనిస్టిట్యూషన్ డైరెక్టర్లు, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు. చేవెళ్లలోని మహేందర్ రెడ్డి మెడికల్ కాలేజీలో హెచ్ఐవీపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఫ్యాకల్టీ, స్టూడెంట్లు పాల్గొన్నారు.