
మల్కాజిగిరి, వెలుగు: మహిళను చంపి కాళ్లు చేతులు కట్టి సంచిలో కుక్కి చర్లపల్లి రైల్వే స్టేషన్ ఆటో పార్కింగ్ స్థలం వద్ద పడేసిన ఘటనలో నిందితుడిని పోలీసులు గుర్తించారు. రాచకొండ క్రైం బ్రాంచ్ డీసీపీ అరవింద్ బాబు, ఆర్పీఎఫ్సీఐ రాకేశ్, ఏసీపీ వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. పశ్చిమ బెంగాల్ మాల్దా టౌన్‌కు చెందిన వలస కార్మికులే ఈ పనిచేసినట్లు గుర్తించారు. వీరు ఓఆర్ ఆర్ పనుల్లో భాగంగా పని కోసం వచ్చారు. మహిళ డెడ్‌బాడీని దాదాపు 38 కిలోమీటర్లు ఆటోలో పెట్టుకొని వచ్చారు.
సోమవారం ఉదయం 11:40 గంటలకు చర్లపల్లి రైల్వే స్టేషన్‌కు మురళి అనే వ్యక్తి మహిళ డెడ్‌బాడీతో చేరుకున్నాడు. గంటన్నర పాటు రిజర్వేషన్ కౌంటర్ సమీపంలో కూర్చున్నాడు. సంచిలో కుక్కిపెట్టిన డెడ్‌బాడీని అక్కడే వదిలి నాలుగో ప్లాట్‌ఫాంలో డ్రెస్ చేంజ్ చేసుకున్నాడు. తరువాత ఐదో నెంబర్ ప్లాట్ ఫాంలో 3:55 కు అగర్తలా ట్రైన్ ఎక్కి మాల్దా టౌన్లో దిగినట్టు సమాచారం. చనిపోయిన మహిళ వయసు సుమారు 47 సంవత్సరాలు, నిందితుడి వయస్సు 50 సంవత్సరాలు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు.