- రూ.6.16 కోట్ల ఆస్తి పన్ను బకాయిలు ఉండటంతో బల్దియా చర్య
హైదరాబాద్ సిటీ, వెలుగు: ప్రాపర్టీ టాక్స్ డిఫాల్టర్లపై జీహెచ్ఎంసీ చర్యలు తీసుకుంటోంది. ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు మరో వారం మాత్రమే ఉండడంతో మొండి బకాయిదారుల ఆస్తులను సీజ్ చేస్తోంది. సర్కిల్ వారీగా వారెంట్ బృందాలను ఏర్పాటు చేయగా సోమవారం రాజ్ భవన్ రోడ్డులోని కత్రియా హోటల్ ను ఖైరతాబాద్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ఆధ్యర్యంలో సీజ్ చేశారు.
2017 నుంచి కత్రియా హోటల్ ఆస్తి పన్ను చెల్లించడంలేదు. ఇప్పటివరకు రూ. 6 కోట్ల 16 లక్షలు బకాయిలు పడింది. అలాగే నాంపల్లి లోని అరోరా కాలేజ్ రూ.1.28 కోట్లు, గోషామహల్ సర్కిల్ లో సర్ణ ట్రాన్స్పోర్ట్నుంచి రూ.36 లక్షలు , ఇదే సర్కిల్ లో సోనీ సెంటర్ బిల్డింగ్ పై రూ.39.68 లక్షలు, బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10 లోని షమీమ్ సుల్తానా క్లాత్ మాల్ నుంచి రూ.35.27 లక్షలు, పంజాగుట్ట నాగార్జున సర్కిల్లోని సింఫోసిస్ బిజినెస్ సొల్యూషన్ బిల్డింగ్ పై రూ. 17.94 లక్షల బకాయిలు ఉండటంతో సీజ్ చేశారు. కొన్ని భవనాలపై 2012 నుంచి బకాయిలు పెండింగ్‌లో ఉన్నట్లు గుర్తించారు. బకాయిలున్నవారు ఓటీఎస్ పథకం కింద వడ్డీ లో 90 శాతం డిస్కౌంట్ పొందవచ్చని సూచించారు.
తాండూర్‌లో రెడ్ నోటీసులు
తాండూర్: తాండూరులో ఆస్తి పన్ను మొండి బకాయిదారులపై అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. పోట్లీ మహరాజ్ దేవాలయానికి చెందిన దుకాణాలను సోమవారం సీజ్ చేసి తాళాలు వేశారు. అలాగే ప్రైవేట్ ప్రాపర్టీలకు సంబంధించిన బకాయిదారులకు రెడ్ నోటీసులు అందజేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ.. సకాలంలో పన్నులు చెల్లించకపోతే మున్సిపాలిటీ గ్రాంట్లు నిలిచిపోయే అవకాశం ఉందని, కావున బాధ్యతగా పన్నులు కట్టి పట్టణాభివృద్ధికి పాటుపడాలని ప్రజలను కోరారు.
