కొత్త మెడికల్ కాలేజీల్లో 100 సీట్లకే ప్రతిపాదనలు

కొత్త మెడికల్ కాలేజీల్లో 100 సీట్లకే ప్రతిపాదనలు
  • కొత్త వాటిపై రాష్ట్ర సర్కార్ ప్రతిపాదనలు 
  • ఒక్కో కాలేజీలో మొదట 150 సీట్లతో ఏర్పాటు చేస్తామన్న ప్రభుత్వం
  • ఆ సీట్లకు సరిపడా హాస్పిటళ్లలో బెడ్లు లేకపోవడంతో నిర్ణయం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న ఒక్కో మెడికల్‌‌ కాలేజీలో వంద సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ఒక్కో కాలేజీని 150 సీట్లతో ఏర్పాటు చేస్తామని తొలుత  ప్రకటించినప్పటికీ, వంద సీట్లకే ప్రతిపాదనలు రూపొందించారు. నేషనల్ మెడికల్‌‌ కమిషన్ రూల్ ప్రకారం 150 సీట్లతో మెడికల్ కాలేజీ మంజూరు చేయాలంటే, దానికి అనుబంధంగా కనీసం 500 బెడ్ల హాస్పిటల్ ఉండాలి. 
కానీ, మన దగ్గర మెడికల్‌‌ కాలేజీలుగా మారుస్తున్న హాస్పిటళ్లలో ఆ స్థాయిలో బెడ్లు లేవు. వంద సీట్ల కాలేజీ మంజూరుకు కనీసం 430 బెడ్ల హాస్పిటల్ ఉంటే సరిపోతుంది. మన దగ్గర ఒక్క కరీంనగర్ హాస్పిటల్ మినహా ఇంకెక్కడా‌‌ ఇన్ని బెడ్లు లేవు. ఖమ్మం జిల్లా హాస్పిటల్‌‌లో 400 బెడ్లు ఉండటంతో మరికొన్ని బెడ్లు ఏర్పాటు చేస్తున్నారు. వికారాబాద్, కామారెడ్డి, జనగామ హాస్పిటళ్లలో 150 బెడ్ల చొప్పున మాత్రమే ఉన్నాయి. 
ఆయా హాస్పిటళ్లలో కొత్తగా 280 బెడ్లు చొప్పున ఏర్పాటు చేయాల్సి ఉంది. ఆసిఫాబాద్, భూపాలపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లా దవాఖాన్లలోనూ మెడికల్‌‌ కాలేజీలకు అవసరమైనన్ని బెడ్లు లేవు. దీంతో 150 ఎంబీబీఎస్ సీట్లకు బదులు, వంద సీట్లతోనే కాలేజీలు ప్రారంభించాలని సర్కార్ నిర్ణయించినట్టు మెడికల్‌‌ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు 
చెబుతున్నారు.
వైద్య విద్య పరిధిలోకి దవాఖాన్లు 
రాష్ట్రంలో జిల్లాకో మెడికల్‌‌ కాలేజీ ఏర్పాటులో భాగంగా తొలి విడతలో మెడికల్ కాలేజీలుగా మారుస్తున్న 8 హాస్పిటళ్లను తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధి నుంచి మెడికల్‌‌ ఎడ్యుకేషన్‌‌ పరిధిలోకి మారుస్తూ శనివారం‌‌ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ జాబితాలో రామగుండం ఏరియా హాస్పిటల్, మంచిర్యాల, సంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వనపర్తి, నాగర్‌‌కర్నూల్, జగిత్యాల జిల్లా హాస్పిటళ్లు ఉన్నాయి. కొత్త రిక్రూ‌‌ట్‌‌మెంట్ అయ్యే వరకు ప్రస్తుతం ఈ హాస్పిటళ్లలో పనిచేస్తున్న డాక్టర్లు, సిబ్బందిని అలాగే కొనసాగించాలని జీవోలో పేర్కొన్నారు.