అడవులను కాపాడుకుంటేనే రక్షణ : మంత్రి కొండా సురేఖ

అడవులను కాపాడుకుంటేనే రక్షణ : మంత్రి కొండా సురేఖ
  •   ప్రతి కుటుంబం ఒక మొక్క పెంచాలి
  •     మంత్రి కొండా సురేఖ పిలుపు
  •     దూలపల్లిలో ఘనంగా ప్రపంచ అటవీ దినోత్సవం
  •     అటవీ, పోలీస్ అకాడమీల మధ్య కీలక ఒప్పందం

హైదరాబాద్, వెలుగు: అడవుల పరిరక్షణ ప్రతిఒక్కరి బాధ్యత అని, చెట్లను కాపాడితేనే మన భవిష్యత్తు ఉంటుందని మంత్రి కొండా సురేఖ అన్నారు. సోమవారం దూలపల్లిలోని తెలంగాణ అటవీ అకాడమీలో ప్రపంచ అటవీ దినోత్సవాలను ఘనంగా నిర్వహించారు. అకాడమీ డైరెక్టర్  ప్రియాంక వర్గీస్  ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మంత్రి సురేఖ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

పట్టణీకరణ, పరిశ్రమల విస్తరణ వల్ల అడవులు తగ్గిపోతుండటంపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల వాతావరణ మార్పులు, నీటి కొరత వంటి సమస్యలు ఎదురవుతున్నాయని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం వనమహోత్సవం ద్వారా పెద్దఎత్తున మొక్కలు నాటుతోందని, ప్రతి కుటుంబం ఒక మొక్కను పెంచే బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు.

అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి అహ్మద్  నదీమ్  మాట్లాడుతూ అడవులు పర్యావరణ సమతుల్యతకు కీలకమన్నారు. అడవుల సంరక్షణలో ఫ్రంట్‌‌‌‌లైన్ సిబ్బంది చేస్తున్న కృషి ప్రశంసనీయమం అన్నారు. అటవీ దళాల ముఖ్య సంరక్షణాధికారి డాక్టర్  సువర్ణ మాట్లాడుతూ అడవులు మానవ జీవితంలో విడదీయలేని భాగమని, మన మనుగడకు అవే జీవనాధారమన్నారు.

పోలీస్ అకాడమీ డైరెక్టర్  అభిలాష్  బిస్త్  మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణపై అందరికీ అవగాహన ఉండాలన్నారు. కాగా.. దూలపల్లి తెలంగాణ స్టేట్  ఫారెస్ట్ అకాడమీ (టీజీఎస్‌‌ఎఫ్ఏ), హిమాయత్ సాగర్‌‌లోని రాజాబహదూర్  వెంకట రామరెడ్డి తెలంగాణ పోలీస్  అకాడమీ (ఆర్‌‌బీవీఆర్‌‌ఆర్‌‌) మధ్య శిక్షణ, సామర్థ్యాభివృద్ధి రంగాల్లో పరస్పర సహకారం కోసం అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ సందర్భంగా అడవుల, వన్యప్రాణుల సంరక్షణలో విశేష కృషి చేసిన అధికారులు, స్వచ్ఛంద సంస్థలకు మంత్రి సురేఖ ప్రశంసాపత్రాలు అందజేశారు. అనంతరం అకాడమీలో పలు అభివృద్ధి పనులకు ఆమె శంకుస్థాపన చేశారు.