ఎన్నికలప్పుడే గుర్తొస్తమా? సొంత ఇలాకాలో మంత్రి మల్లారెడ్డికి నిరసన సెగ

ఎన్నికలప్పుడే గుర్తొస్తమా? సొంత ఇలాకాలో  మంత్రి మల్లారెడ్డికి నిరసన సెగ

శామీర్​పేట, వెలుగు:  సొంత ఇలాకాలో మంత్రి మల్లారెడ్డికి కొద్దిరోజులుగా నిరసన సెగ  తగులుతోంది. మంత్రి ఎక్కడికెళ్లినా అడుగడుగునా ప్రజలు అడ్డుకుని నిలదీస్తున్నారు. తమ గ్రామాల్లో అభివృద్ధి పనులు ఎందుకు చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు. సోమవారం మేడ్చల్ జిల్లా శామీర్ పేట మండలంలోని పలు గ్రామాల్లో మంత్రి మల్లారెడ్డి పర్యటించగా నిరసన ఎదురైంది. బాబాగూడ, బొమ్మరాసిపేట, పొన్నాల గ్రామాల్లో పాదయాత్ర నిర్వహించగా.. ఆయా గ్రామాల ప్రజలు అడ్డుకున్నారు. బొమ్మరాసిపేటలో కొన్ని సర్వే నెంబర్లను రైతుల భూములను రెవెన్యూ అధికారులు హోల్డ్​లో పెట్టడంతో బాధితులు కలెక్టరేట్​ను ముట్టడించారు. అధికారులు పట్టించుకోవడం లేదని తమ సమస్యలను సర్పంచ్​కు చెప్పుకుంటే ఆయన కూడా  లెక్కచేయడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ALSO READ :రేవంత్‌ రెడ్డి కామెంట్లతో కాంగ్రెస్‌ అసలు రంగు బయపడ్డది : జగదీశ్ రెడ్డి

పొన్నాల గ్రామంలో సైతం జనం మంత్రిని నిలదీశారు. ఎన్నికలప్పుడే తమ ఊరు గుర్తుకొస్తుందని, ఇన్నిరోజులు ఎందుకు రాలేదని మల్లారెడ్డి ప్రశ్నిస్తూ ఆగ్రహం వ్యక్తంచేశారు. సమస్యలు చెప్పుకుందామని వెళ్తే కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలంటూ మంత్రి మల్లారెడ్డి హేళన చేశారని మండిపడ్డారు. ఐదేళ్ల కింద పొన్నాల గ్రామాన్ని దత్తత తీసుకుంటానని హామీ ఇచ్చిన మంత్రి.. ఆ తర్వాత మర్చిపోయారని విమర్శించారు. ఇప్పుడు ఎన్నికలు వస్తుండగా మళ్లీ వచ్చారని అసహనం వ్యక్తం చేశారు. రోడ్లు డ్రైనేజీలు అధ్వానంగా ఉన్నాయని మంత్రిని నిలదీశారు. దీంతో మల్లారెడ్డి అక్కడ నుండి వెళ్లిపోయారు.