రాష్ట్రం లాకప్ డెత్​లకు అడ్డాగా మారింది.. పౌరహక్కుల సంఘాల నిరసన

రాష్ట్రం లాకప్ డెత్​లకు అడ్డాగా మారింది.. పౌరహక్కుల సంఘాల నిరసన
  • రాష్ట్రం లాకప్ డెత్​లకు అడ్డాగా మారింది
  • తుకారం గేట్ పీఎస్​లో చనిపోయిన చిరంజీవిది హత్యే
  • మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలంటూ  పౌరహక్కుల సంఘాల నిరసన

సికింద్రాబాద్, వెలుగు: వారం రోజుల కిందట తుకారం గేట్ పీఎస్​లో చనిపోయిన చిరంజీవిది ముమ్మాటికీ పోలీసుల హత్యేనంటూ ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు ఆరోపించాయి. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని  డిమాండ్ చేస్తూ  మంగళవారం అడ్డగుట్టలోని  జేఎం అంజయ్య విగ్రహం ముందు నిరసన చేపట్టాయి. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ..  ఓవైపు ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటూనే.. మరోవైపు దళిత, గిరిజన, మైనార్టీల హత్యలకు పోలీస్ స్టేషన్లు కేంద్రాలుగా మారాయని మండిపడ్డారు. సరిగ్గా ఏడాది కిందట నల్గొండ జిల్లా అడ్డగూడూరుకు చెందిన మరియమ్మ, తర్వాత మెదక్ ప్రాంతానికి చెందిన ఖదీర్, ఇప్పుడు తుకారాం గేట్​కు చెందిన చిరంజీవి.. ఈ ముగ్గురిని దొంగతనం కేసులో అనుమానంతో విచారణకు  పిలిచి థర్డ్ డిగ్రీ ఉపయోగించి వారి చావులకు కారణమయ్యారని ఆరోపించారు. చిరంజీవి చనిపోయి వారం రోజులు కావొస్తున్నా ఇప్పటివరకు ఎవరిపైనా చర్యలు తీసుకోకుండా కేసును నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి చిరంజీవి మృతికి కారణమైన పోలీసులపై అట్రాసిటీ, క్రిమినల్ కేసు ఫైల్ చేయాలన్నారు. నిరసనలో  పౌరహక్కుల సంఘం నాయకులు -విష్ణువర్ధన్ రెడ్డి, సీపీఐ సికింద్రాబాద్ కార్యదర్శి- కాంపెల్లి శ్రీనివాస్, ఎమ్మార్పీఎస్ ​నాయకులు మల్లికార్జున్ పాల్గొన్నారు.