
నర్సింహులపేట, వెలుగు: ‘అన్ని అర్హతలు, పింఛన్ కార్డున్నా ఇంత వరకు పింఛన్ రావట్లేదు’ అంటూ ఓ వికలాంగుడు డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ ను అడ్డుకున్నాడు. సోమవారం మహబూబాబాద్ జిల్లాలోని నర్సింహులపేట మండలంలోని పడమటిగుడెం, చారి తండా, గ్యామ తండా, బస్తారం తండా, కొమ్ములవంచ, రూప్ల తండా పరిధిలో అభివృద్ధి పనులను ఎమ్మెల్యే రెడ్యానాయక్ ప్రారంభించారు. పడమటిగుడెంలో జక్కుల యాకన్న అనే వికలాంగుడు తనకు అన్ని రకాల సర్టిఫికెట్లు, గతంలో పంపిణీ చేసిన ఆసరా గుర్తింపు కార్డు ఉన్నా పింఛన్ రావడం లేదని ట్రై సైకిల్ తో ఎమ్మెల్యే కారును అడ్డగించారు. దీంతో ఆయన ఎంపీడీవోను సంప్రదించమని చెప్పారు. గ్రామంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ డోర్నకల్ ను అన్ని రకాలుగా అభివృద్ధి చేశానని, మీరు మంచోళ్లయితే ఓట్లన్నీ తనకే వేయాలన్నారు. కేసీఆర్వడ్లు కొనకపోతే 15వందలకు కూడా వడ్లు కొనేటోళ్లు లేరని, కేవలం బీఆర్ఎస్ కు మాత్రమే ఓట్లడిగే హక్కు ఉందన్నారు.
ఎవరెన్ని కాకమ్మ కథలు చెప్పిన వినొద్దన్నారు. తర్వాత గ్యామ తండాకు వెళ్లగా వారం నుంచి మిషన్‌భగీరథ నీళ్లు రావడం లేదని తండావాసులు ఎమ్మెల్యేను నిలదీశారు. దీంతో రెండు రోజుల్లో సమస్య పరిష్కరించాలని ఆఫీసర్లను ఆదేశించారు. కొమ్ములవంచలో 30 డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టుకున్నారని, అందులో ఆరు రిజెక్ట్ చేశారని, తాము కూడా ఇండ్లు కట్టుకున్నామని..వాటి స్థానంలో తమకు బిల్లులు ఇవ్వాలని కొందరు లబ్ధిదారులు డిమాండ్‌చేశారు. త్వరలోనే బిల్లులు ఇప్పించేలా చూస్తానని హామీ ఇచ్చారు. కొమ్ములవంచలో మీటింగ్ వచ్చిన వారు డబ్బుల కోసం ఎగబడగా గందరగోళం నెలకొంది. తీసుకున్నవాళ్లే మళ్లీ అడుగుతున్నారనే అనుమానంతో గ్రామ పంచాయతీలోకి పంపించి తర్వాత ఒక్కొక్కరిని బయటకు పిలిచి డబ్బులు ఇచ్చి పంపించారు. ఎంపీపీ టేకుల సుశీల,మండల పార్టీ అధ్యక్షుడు మైదం దేవేందర్, జిల్లా రైతు బంధు మెంబర్ తోట సురేశ్, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మెరుగు శంకర్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు గుగులోతు రవి, సర్పంచులు జొన్నగడ్డ యదలక్ష్మి పాల్గొన్నారు.