జీవో 111 రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి

జీవో 111 రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి

హైదరాబాద్, వెలుగు: జీవో 111ను రద్దు చేస్తూ బీఆర్ఎస్  సర్కారు ఇటీవలే తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్  చేస్తూ ఉగాండాతో పాటు దేశంలోని 17 నగరాల్లో నిరసన ప్రదర్శనలు చేపట్టారు. క్లైమేట్  ఫ్రంట్  అనే సంస్థ ఇచ్చిన పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ఈ ప్రదర్శనలు నిర్వహించారు. జీవో 111 రద్దు నిర్ణయానికి వ్యతిరేకంగా తమ సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన ప్రదర్శనలకు మద్దతు తెలపాలని దేశవ్యాప్తంగా ప్రజలకు క్లైమేట్  ఫ్రంట్ విజ్ఞప్తి చేసింది. ‘‘వరదలను అడ్డుకునేందుకు 1995లో జీవో 111ను అమల్లోకి తెచ్చారు. కానీ, ప్రస్తుత బీఆర్ఎస్  ప్రభుత్వానికి ఆ జీవో ఒక జోక్ గా మారింది. ఆ జీవోను రద్దుచేస్తూ బీఆర్ఎస్  ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. జీవో 111 రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని ఆ జీవోను మరింత బలోపేతం చేయాలి. ఆ జీవో రద్దుచేసి హైదరాబాద్, హైదరాబాదీలను ప్రమాదంలో పడేయొద్దు” అని క్లైమేట్  ఫ్రంట్  డిప్యూటీ డైరెక్టర్  18 ఏండ్ల రుచిత్  ఆశా కమల్  పేర్కొన్నది. తమ సంస్థ నేతృత్వంలో జాతీయ స్థాయిలో నిరసన ప్రదర్శనలు జరిగాయని ఆమె ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. హైదరాబాద్ లోని జంట జలాశయాలే కాకుండా కేరళలోని ఇసుక మైనింగ్, జమ్మూలోని రైకా అడవుల నరికివేతపైనా నిరసనలు తెలిపామని ఆమె వెల్లడించింది. కేరళ, రాజస్థాన్, తెలంగాణ, జమ్మూ, ముంబైతో పాటు ఉగాండాలోని కంపాలా నుంచి కూడా పర్యావరణవేత్తలు ఈ నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారని తెలిపింది. క్యాస్టల్లినో అనే 11 ఏండ్ల బాలిక ముంబై మెట్రోకు వ్యతిరేకంగా నిరసన తెలిపిందని రుచిత్  వెల్లడించింది.