మోడీ పర్యటనపై  సోషల్ మీడియాలో నిరసన

మోడీ పర్యటనపై  సోషల్ మీడియాలో నిరసన
  • ట్రెండ్ అయిన ఈక్వాలిటీ ఫర్ తెలంగాణ హాష్ ట్యాగ్

హైదరాబాద్, వెలుగు: స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ విగ్రహ ఆవిష్కరణకు హైదరాబాద్ వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీని ఈక్వాలిటీ ఫర్ తెలంగాణ కావాలంటూ టీఆర్ఎస్ లీడర్లు, నెటిజన్లు డిమాండ్​ చేశారు. ఈ మేరకు శనివారం ‘ఈక్వాలిటీ ఫర్ తెలంగాణ’ హాష్ ట్యాగ్ ట్విట్టర్ లో జాతీయ స్థాయిలో ఫస్ట్​ ప్లేస్​లో ట్రెండ్ అయింది. రాష్ట్ర సమస్యలు, కేంద్రం ఇవ్వాల్సిన ప్రాజెక్టులపై ట్యాంక్​బండ్​ మీద ఫ్లెక్సీ పెట్టారు. కేంద్ర ప్రభుత్వ నిధుల పంపిణీ, రాష్ట్ర సర్కారు చేపట్టిన కార్యక్రమాలకు అందని సాయం, విభజన చట్టం హామీలు, రాష్ట్ర ప్రాజెక్టులకు దక్కని జాతీయ హోదా వంటి అంశాలపై ప్రశ్నించారు.
మాపై వివక్ష ఎందుకు?: మంత్రుల ట్వీట్
రాష్ట్రంపై కేంద్రం వివక్ష చూపిస్తోందని పలువురు రాష్ట్ర మంత్రులు ట్విట్టర్​లో ఆరోపించారు. కర్నాటకలోని అప్పర్ భద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చిన కేంద్రం.. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం పంపిన లేఖలపై కేంద్రం ఇప్పటిదాకా స్పందించకపోవడం పట్ల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రశ్నించారు. తెలంగాణలోని వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగంపై కేంద్రం చూపిస్తున్న వివక్షను మంత్రి నిరంజన్ రెడ్డి లేవనెత్తారు. సమ్మక్క-సారలమ్మ జాతరను జాతీయ పండుగగా గుర్తించకపోవడంపై మంత్రి సత్యవతి రాథోడ్ క్వశ్చన్ చేశారు. తెలంగాణ లాంటి అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాన్ని కేంద్రం ఎం దుకు అడ్డుకుంటోందని ఎంపీ రంజిత్ రెడ్డి ట్వీట్ చేశారు. కాగా, దాదాపు 20వేలకు పైగా ట్వీట్లు ఈక్వాలిటీ ఫర్ తెలంగాణ హాష్ ట్యాగ్​తో ట్విట్టర్​లో ట్రెండ్ అయినట్లు మంత్రి కేటీఆర్ ఆఫీస్ తెలిపింది.