రోడ్డు లేదని.. పిల్లనిస్తలేరు 

రోడ్డు లేదని.. పిల్లనిస్తలేరు 
  • వరి నాట్లు వేసి గ్రామస్తులు నిరసన

కొడిమ్యాల, వెలుగు: రోడ్డు లేకపోవడంతో ఊర్లో యువకులకు పిల్లనివ్వడం లేదని, తక్షణం రోడ్డు మంజూరు చేయాలంటూ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం దమ్మయ్యపేట విలేజ్ లోని ఒడ్డెర కాలనీలో 500 జనాభా ఉంది. సుమారు రెండు కిలో మీటర్ల మేర రోడ్డు లేక అవస్థలు పడుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్డు పూర్తిగా దెబ్బతినడంతో మంగళవారం గ్రామస్తులు ధర్నాకు దిగారు. రోడ్డుపై బురదలో వరి నాట్లు వేసి నిరసన తెలిపారు. ఏకగ్రీవ పంచాయతీ అయినప్పటికీ ప్రభుత్వం ప్రోత్సాహకం డబ్బులు మంజూరు చేయడం లేదని, దీంతో మారుమూల ప్రాంతమైన తమ గ్రామం అభివృద్ధికి దూరంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 10 రోజుల్లో రోడ్డు శాంక్షన్ చేయకుంటే పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో సర్పంచ్ తునికి నర్సయ్య, గ్రామస్తులు పాల్గొన్నారు.