పద్మారావుగౌడ్‌‌కు నిరసన సెగ

పద్మారావుగౌడ్‌‌కు నిరసన సెగ

సికింద్రాబాద్, వెలుగు: సికింద్రాబాద్ సెగ్మెంట్ బీఆర్ఎస్ క్యాండిడేట్, డిప్యూటీస్పీకర్​ పద్మారావుగౌడ్‌‌కు నియోజకవర్గంలో అడుగడుగునా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.  ఇటీవల పార్సిగుట్టలో  ఓ మహిళ తమ బస్తీకి ప్రచారానికి రావొద్దని పద్మారావును అడ్డుకుని డప్పు కొట్టి నిరసన తెలపగా..  శుక్రవారం తార్నాక డివిజన్ మాణికేశ్వరినగర్‌‌‌‌లో ఆస్పత్రి నిర్మించలేదని బస్తీ వాసులు ఆయనను అడ్డుకున్నారు. పద్మారావుగౌడ్‌‌ను ఓడించి తీరుతామని హెచ్చరించారు. ప్రభుత్వ ఆసుపత్రిని నిర్మించే వరకు పద్మారావుగౌడ్  బస్తీలోకి అడుగు పెట్టకూడదని వారు మండిపడ్డారు.  ‘వి వాంట్ హాస్పిటల్’, ‘పద్మారావు గో బ్యాక్’ అంటూ ప్లకార్డులు  పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. 

శుక్రవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా తార్నాక డివిజన్ పరిధిలోని మాణికేశ్వరినగర్​లో పార్టీ కార్యకర్తలతో కలిసి పద్మారావు గౌడ్ ప్రచారం ప్రారంభించారు. కమాన్ వద్దనే బస్తీవాసులు ఆయనను అడ్డుకొని నిలదీశారు.   ఆస్పత్రి నిర్మాణం కోసం126 రోజులు దీక్షలు చేపట్టినా  ఏ ఒక్కరోజు  వచ్చింది లేదని పద్మారావుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఎన్నిసార్లు  ఆయనకు  మొర పెట్టుకున్నా స్థానిక ఎమ్మెల్యే అయి ఉండి పట్టించుకోలేదని మండిపడ్డారు.  
బస్తీలో స్థలం లేని కారణంగా ఆస్పత్రి నిర్మాణం జరగలేదని పద్మారావు గౌడ్ అన్నారు.  ఉన్న స్థలం ఉస్మానియా యూనివర్సిటీది కావడంతో ఆస్పత్రి నిర్మాణం విషయంలో ఆలస్యమవుతోందన్నారు.  ఎన్నికల్లో గెలిపిస్తే వర్సిటీ అధికారులతో మాట్లాడి ఆస్పత్రి నిర్మాణం జరిపిస్తానని ఆయన చెప్పారు.