రాజస్థాన్ అసెంబ్లీలో హైడ్రామా నడిచింది. సీఎం అశోక్ గెహ్లాట్ 2023 –24 బడ్జెట్ కు బదులు పాత బడ్జెట్ చదివి వినిపించారు. పట్టణాభివృద్ధి, అగ్రికల్చర్ బడ్జెట్ కు సంబంధించిన అంశాలన్నీ గతేడాది బడ్జెట్ ను పోలి ఉన్నాయని విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. ఒక్కసారిగా వెల్ లోకి దూసుకెళ్లారు. స్పీకర్ సీపీ జోషి వారించినా బీజేపీ ఎమ్మెల్యేలు వెనక్కి తగ్గకపోవడంతో స్పీకర్ సభను 30 నిమిషాల పాటు వాయిదా వేశారు. సభ తిరిగి ప్రారంభమైన తర్వాత సీఎం అశోక్ గెహ్లాట్ క్లారిటీ ఇచ్చారు. బడ్జెట్ కాపీలో ఒక పేజీ పాతది వచ్చిందని చెప్పారు. జరిగిన పొరపాటుకు క్షమాపణ కోరారు.
సీఎం గెహ్లాట్ 8 నిమిషాల పాటు పాత బడ్జెట్ నే చదవడాన్ని మాజీ సీఎం వసుంధరా రాజే తప్పుబట్టారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తాను సమర్పించబోయే బడ్జెట్ ను చదవకుండా అసెంబ్లీకి రావడం ఏంటని ప్రశ్నించారు. దీన్ని బట్టి ఆయన రాష్ట్రాన్ని ఎలా పాలిస్తున్నారో అర్థం చేసుకోవచ్చని అన్నారు.
