సాగర్ లో నిమజ్జనాలు చేయొద్దని ఏ కోర్టూ చెప్పలె

సాగర్ లో నిమజ్జనాలు చేయొద్దని ఏ కోర్టూ చెప్పలె

హైదరాబాద్ లో గణేశ్ నిమజ్జనంపై ప్రభుత్వం ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడంపై నగరంలో ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపు మేరకు పలుచోట్ల పార్టీ కార్యకర్తలు నిరసనలు చేపట్టారు. ఈ క్రమంలో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి భగవంత రావు ఆమరణ నిరాహార దీక్షకు బీజేపీ జాతీయ కార్యదర్శి మురళీధర్ రావు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గణేష్ నిమజ్జనానికి వినాయక సాగర్ దగ్గర ప్రభుత్వం ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వం హిందూ పండగలపై నిర్లక్ష్యం వహిస్తుందని... ఎల్లుండే నిమజ్జనం అయినా... ఇప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టమైన వైఖరి లేదని ఆరోపించారు. మండపాల నిర్వాహకులు అయోమయంలో ఉన్నారని మురళీధర్ రావు అన్నారు. 

సికింద్రాబాద్ సీతాఫల్ మండిలో నిరసన వ్యక్తం చేస్తున్న బీజేపీ నేతలను చిలకలగూడ పోలీసులు అరెస్టు చేశారు. వినాయక విగ్రహాల నిమజ్జనం విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానానికి వ్యతిరేఖంగా నిరసనలు చేపట్టాలని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ పిలుపునిచ్చారు.  దీంతో మాజీ మేయర్ బండ కార్తీక రెడ్డి, ఇతర నేతలు సీతాఫల్ మండిలో ఆందోళన చేశారు. ఈ నేపథ్యంలో ఆందోళన కారులను అరెస్టు చేసి పోలీసులు పీఎస్ కు తరలించారు.

ఎట్టి పరిస్థితుల్లోనూ హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేస్తాం

వినాయక నిమజ్జనంపై ప్రభుత్వం వైఖరికి వ్యతిరేకంగా ఉప్పల్ రింగ్ రోడ్డు దగ్గర భాగ్యనగర్ ఉత్సవ కమిటీ నేతలు నల్ల జెండాలతో నిరసన చేపట్టారు. హుస్సేన్ సాగర్ లో పీఓపీ విగ్రహాల నిమజ్జనం చేయాలంటూ రోడ్ పై బైటాయించి ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ఉప్పల్ రింగ్ రోడ్డు దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఈ సందర్భంగా గణేష్ నిమర్జనంపై ఆంక్షలు ఎత్తివేయాలని నిరసన నేతలు డిమాండ్ చేశారు. హిందువుల హక్కులను గౌరవించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేస్తామన్నారు. ఈ క్రమంలో కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేయగా... భాగ్యనగర్ ఉత్సవ కమిటీ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ చిన్నపాటి ఘర్షణలో పోలీసులు, కార్యకర్తలను నెట్టివేశారు.

హిందు పండుగల పై కక్ష సాధింపు చర్యలు సరికావు

గణేష్ నిమజ్జనం కోసం హుస్సేన్ సాగర్ పై కేసీఆర్ ప్రభుత్వం ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడం హిందువుల పై కక్ష సాధింపు చర్యలే అని భాగ్యనగర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు సంరెడ్డి సురేందర్ రెడ్డి అన్నారు. గణేష్ నిమజ్జనంకు హుస్సేన్ సాగర్ పై కేసీఆర్ ప్రభుత్వం ఎలాంటి సౌకర్యాలు చేయకపోవడంతో ఐఎస్ సదన్  చౌరస్తాలో హిందూ సంఘాలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. భారీ ఎత్తున హిందూ భక్తులు హాజరై కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో భారీ బలగాలతో పోలీసులు అక్కడికి చేరుకొని వారిని అరెస్ట్ చేసి సైదాబాద్ పోలీస్ స్టేషన్ కి తరలించారు.

అలా ఏ కోర్టూ చెప్పలేదు...

జూబ్లీహిల్స్, ఫిల్మ్ నగర్ భారతీయ విధ్యా భవన్ సర్కిల్ వద్ద భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా చేపట్టిన  ర్యాలీని పోలీసులు అడ్డుకుని వారిని అరెస్టు చేశారు. ఈ నెల 9న  వినాయక్ సాగర్‌లో నిమజ్జనోత్సవాలు నిర్వహిస్తామన్నారు. సమయం సమీపిస్తున్నా ప్రభుత్వం ఇంతవరకు తగిన ఏర్పాట్లు చేయకపోవడంపై వారు అసంతృప్తి వ్యక్తం చేశారు. ధార్మిక కార్యక్రమాన్ని రాజకీయ కోణంలో చూడొద్దని విజ్ఞప్తి చేశారు. కాలుష్యం, కోర్టు తీర్పు బూచిగా చూపి నిమజ్జనాలను అడ్డుకోవాలని చూస్తున్నారన్నారు. ఏ కోర్టు కూడా సాగర్‌లో నిమజ్జనాలు చేయొద్దని చెప్పలేదన్నారు.

నిమజ్జనంపై రాష్ట్ర ప్రభుత్వం ఇలా వ్యవహరించడం సిగ్గు చేటు

గణేష్ నిమజ్జన విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వ్యవహరిస్తున్న వైఖరికి నిరసనగా ఎల్బీనగర్ లో బీజేపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ నాయకులుస, కార్పొరేటర్లు చింతలకుంటలోని చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద నిరసన తెలిపారు.ఈ సందర్భంగా సామ రంగారెడ్డి మాట్లాడుతూ... నిమజ్జనంపై రాష్ట్ర ప్రభుత్వం ఇలా వ్యవహరించడం సిగ్గు చేటన్నారు. హిందు పండగలపై టీఆర్ఎస్ ప్రభుత్వం ఎదో ఒక ఆంక్షలు విడుస్తూ వస్తోందని, ఈ పద్దతి మార్చుకోకుంటే ప్రజల నుండి ఎదురుదెబ్బ తప్పదన్నారు. ఇప్పటికైనా నిమజ్జనంపై ఏర్పాట్లు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. 

నిరసన, రాస్తారాకో...

హైద్రాబాద్ పాతబస్తీ లాల్ ధర్వాజా X రోడ్డు చొరస్థా లో BJP, RSS, భజరంగ్ దళ్, గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ ధర్నాలో పాతబస్తీలోని నాలుగు నియోజకవర్గ స్థాయిలోని నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ క్రమంలో TRS ప్రభుత్వం తీరును నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించి నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.