ఫుట్ బాల్ వరల్డ్ కప్ లో ఓటమి.. బెల్జియంలో  నిరసనలు

ఫుట్ బాల్ వరల్డ్ కప్ లో ఓటమి.. బెల్జియంలో  నిరసనలు

ఖతర్ లో జరుగుతున్న ఫిఫా ఫుట్ బాల్ వరల్డ్ కప్ లో ఆదివారం మొరాకోతో జరిగిన మ్యాచ్ లో బెల్జియం టీమ్ ఓడిపోయింది.  దీంతో బెల్జియం టీమ్ అభిమానులు రాజధాని బ్రసెల్స్ లో నిరసనకు దిగారు. రాస్తారోకోలు చేపట్టారు. పలువురు నిరసనకారులు ఆగ్రహంతో మొరాకో జాతీయ పతాకాలను దహనం చేశారు. పలుచోట్ల వాహనాలకు నిప్పు పెట్టారు. పోలీసులు టియర్ గ్యాస్, భాష్ప వాయు గోళాలతో ఆందోళనకారులను చెదరగొట్టారు. అయినా నిరసనను విరమించని కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్లకు తరలించారు. 

మ్యాచ్ లో  ఏం జరిగింది ?

ఆదివారం జరిగిన బెల్జియం, మొరాకో ఫుట్ బాల్ మ్యాచ్ విషయానికొస్తే.. అందులో అనూహ్య ఫలితం వచ్చింది. టాప్ టీమ్స్ జర్మనీ, అర్జెంటీనా లాగే బెల్జియం కూడా ఓడిపోయింది. ఎంతోమంది స్టార్ ప్లేయర్లతో వరల్డ్ నంబర్‌ 2 ర్యాంకులో ఉన్న  బెల్జియం, మొరాకో చేతిలో 2-, 0 పాయింట్ల తేడాతో ఓడిపోయింది. దీంతో ఫిఫా వరల్డ్ కప్ లో బెల్జియం ఆశలు అనిశ్చితిలో పడ్డాయి. అంతకుముందు మొదటి మ్యాచ్ లో గెలిచి దూకుడుగా ఉన్నట్టు కనిపించిన బెల్జియం.. రెండో మ్యాచ్‌లో మాత్రం పేలవంగా ఆడి ఓడింది. ఒకవేళ మొరాకోతో గెలిచి ఉంటే.. బెల్జియం నాకౌట్ దశలోకి అడుగుపెట్టి ఉండేది. బెల్జియం నాకౌట్ దశకు చేరాలంటే.. క్రొయేషియాతో జరిగే  తదుపరి మ్యాచ్ లో తప్పనిసరిగా గెలవాలి. 

‘గ్రూప్‌- ఎఫ్‌’లో  మొరాకో టాప్ 

ఇక బెల్జియంపై గెలుపుతో మొరాకో ‘గ్రూప్‌- ఎఫ్‌’లో  టాప్ ప్లేస్ ను సంపాదించింది. మొరాకో మొదటి మ్యాచ్ క్రొయేషియాతో జరగగా.. అది డ్రాగా ముగిసింది. ప్రపంచకప్‌ చరిత్రలో మొరాకో టీమ్ కు ఇది మూడో విజయం మాత్రమే కావడం గమనార్హం. 1998 ప్రపంచకప్‌ తర్వాత ఆ టీమ్ కు మొదటి గెలుపు ఇది. గురువారం రోజున కెనడాతో జరగబోయే మూడో మ్యాచ్ లో మొరాకో కనీసం డ్రా చేసుకున్నా నాకౌట్‌ దశకు  చేరే ఛాన్స్ ఉంటుంది.