రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్లో శ్రమదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ అంకిత్ పాల్గొని పరిసరాలను శుభ్రం చేశారు. ములుగు జిల్లా కేంద్రంలో పురపాలక సంఘం ఆధ్వర్యంలో 2 కే రన్ చేపట్టగా, కలెక్టర్ దివాకర జెండా ఊపి ప్రారంభించారు.
అనంతరం ఆయన వెంకటాపూర్ మండల కేంద్రం, నల్ల గుంట, ఎల్లారెడ్డి పల్లెలో నిర్మాణ దశలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను, గ్రామాల్లో జరుగుతున్న పరిశుభ్రత కార్యక్రమాన్ని కలెక్టర్పరిశీలించారు. వెంకటాపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరుగుతున్న ఇంటర్ పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేశారు. భద్రాచలం ఐటీడీఏలో ఏపీవో జనరల్ డేవిడ్‌రాజ్ ఆధ్వర్యంలో పాత ఫైళ్లు, ప్రస్తుతం వాడకంలో లేని ఫైళ్లను గుర్తించి రికార్డు రూమ్‌లో భద్రపరిచారు.
వివిధ శాఖలకు సంబంధించి ఫైళ్లను ప్రక్షాళన చేశారు. ములకలపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలను మండల స్పెషల్ ఆఫీసర్ రమేశ్ సందర్శించి సౌకర్యాలపై ఆరా తీశారు. - భద్రాద్రి కొత్తగూడెం/ వెంకటాపూర్(రామప్ప) / భద్రాచలం/ ములకలపల్లి, వెలుగు
