పుదుచ్చేరి అసెంబ్లీలో ఇయ్యాల్నే ఫ్లోర్ టెస్ట్

పుదుచ్చేరి అసెంబ్లీలో ఇయ్యాల్నే ఫ్లోర్ టెస్ట్

అధికార కూటమికి మరో ఇద్దరు ఎమ్మెల్యేలు రిజైన్‌
12కు పడిపోయిన కాంగ్రెస్, డీఎంకే బలం 

పుదుచ్చేరి: పుదుచ్చేరిలో రాజకీయ సంక్షోభం మరింత ముదిరింది. అసెంబ్లీలో ఫ్లోర్ టెస్టుకు ఒక్కరోజు ముందు అధికార కాంగ్రెస్, డీఎంకే కూటమికి మరో షాక్ తగిలింది. ఆదివారం ఇంకో ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. కాంగ్రెస్ కు చెందిన లక్ష్మీనారాయణన్​, డీఎంకేకు చెందిన వెంకటేశన్ తమ పదవులకు రిజైన్ చేశారు. పార్టీలో తనకు తగిన గుర్తింపు దక్కలేదని లక్ష్మీనారాయణ అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసినట్లు ఆయన వెల్లడించారు. ఇంతకుముందు నలుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో కాంగ్రెస్ సర్కార్ మైనారిటీలో పడిపోయింది. ప్రభుత్వానికి తగిన మెజారిటీ లేదని ప్రతిపక్షాలు లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) తమిళిసైకి ఫిర్యాదు చేయడంతో… సోమవారం అసెంబ్లీలో బల పరీక్షను ఎదుర్కోవాలని సర్కార్ ను ఆదేశించారు. ఇలాంటి టైమ్ లో మరో ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో సీఎం నారాయణసామి సర్కార్ మైనారిటీలో పడిపోయింది. తమ ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని సీఎం ఆరోపించారు. కాగా, మరో మూడు నెలల్లో పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

ఎవరి బలమెంత?

అసెంబ్లీలో 33 సీట్లు ఉండగా, 3 నామినేటెడ్ సీట్లు ఉన్నాయి. మొత్తం 7 స్థానాలు ఖాళీ కావడంతో.. అసెంబ్లీలో ఎమ్మెల్యేల సంఖ్య 26కు చేరింది. కాంగ్రెస్, డీఎంకే కూటమి బలం 12 కాగా.. ప్రతిపక్షాలకు 14 మంది ఉన్నారు.