
మృతుడి సోదరికి ప్రభుత్వ ఉద్యోగం ప్రకటించిన పంజాబ్ సీఎం
గుండెపోటుతో ఓ రైతు మృతి.. రైతుల దాడిలో ఇద్దరు పోలీసులు మరణం
చండీగఢ్: ఢిల్లీ చలో మార్చ్ సందర్భంగా చనిపోయిన రైతు శుభ్ కరణ్ సింగ్ కుటుంబానికి రూ. కోటి పరిహారం అందజేస్తామని, మృతుడి సోదరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని శుక్రవారం పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ ప్రకటించారు. శుభ్ కరణ్ సింగ్ మృతికి కారణమైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఢిల్లీ చలో మార్చ్ కోసం శంభు, ఖనౌరీ బార్డర్లలో వేలాది మంది రైతులు ట్రాక్టర్ ట్రాలీలు, ట్రక్కులతో వేచి ఉన్నారు.
ఖనౌరీ బార్డర్ వద్ద దర్శన్ సింగ్(62) అనే రైతు శుక్రవారం గుండెపోటుతో చనిపోయాడు. ఆయన భటిండా జిల్లా అమర్ గఢ్‌కు చెందినవాడని రైతు సంఘం నేత సర్వాన్ సింగ్ పాంధేర్ తెలిపారు. ఉద్యమంలో ఇప్పటికే ఇద్దరు వృద్ధ రైతులు గుండెపోటుతో చనిపోగా, ఒక యువ రైతు గాయాలపాలై మరణించాడు. దీంతో ఈ నెల 13న మొదలైన ఉద్యమంలో మరణించిన రైతుల సంఖ్య నాలుగుకు పెరగగా.. అనేక మందికి గాయాలయ్యాయి.
కాగా, రోడ్డుపై బ్యారికేడ్లను తొలగిస్తూ, రాళ్ల దాడులు చేస్తూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించడంతోపాటు ప్రజల, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసంచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హర్యానా పోలీసులు హెచ్చరించారు. ఆస్తులను ధ్వంసం చేసే వారి బ్యాంక్ అకౌంట్లు, ప్రాపర్టీలను జప్తు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రైతుల రాళ్ల దాడిలో ఇప్పటివరకూ ఇద్దరు పోలీసులు చనిపోయారని వివరించారు. దాదాపు 30 మంది పోలీసులు గాయపడ్డారని పేర్కొన్నారు.