- కాంక్రీట్ దిమ్మెలు, ముళ్ల కంచెలు, బారికేడ్లు ఏర్పాటు
- పోలీసుల తీరుపై ఆగ్రహంతో అక్కడే నిరసన శిబిరం
- ప్రభుత్వం నుంచి హామీ లభించడంతో వెనుదిరిగిన పంజాబ్ రైతులు
- ఢిల్లీకి పయనం కొనసాగించిన హర్యానా అన్నదాతలు
అంబాలా: పంజాబ్ రైతులు చేపట్టిన ‘చలో ఢిల్లీ’ కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. భారత్- అమెరికా మధ్య ప్రతిపాదిత ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందానికి (ఎఫ్‌టీఏ) నిరసనగా ఢిల్లీలో తలపెట్టిన ‘కిసాన్ మహాపంచాయత్’కు రైతులు పెద్ద సంఖ్యలో బయలుదేరారు. పంజాబ్, హర్యానా నుంచి భారీ సంఖ్యలో ఢిల్లీకి తరలివెళ్తున్న రైతులను హర్యానా పోలీసులు శంభూ సరిహద్దు వద్ద నిలిపివేశారు.
పంజాబ్- హర్యానా బార్డర్ ప్రాంతంలో కాంక్రీట్ దిమ్మెలు, ఇనుప ముళ్ల కంచెలు, మల్టీ లెవెల్ బారికేడ్లను భారీగా ఏర్పాటు చేశారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అంబాలా జిల్లా వ్యాప్తంగా అధికారులు నిషేధాజ్ఞలు విధించారు. ఢిల్లీ వెళ్లేందుకు అనుమతి లభించకపోవడంతో ఆగ్రహించిన రైతులు శంభూ సరిహద్దునే నిరసన శిబిరంగా మార్చారు. తమ ప్రజాస్వామ్య హక్కును హరిస్తున్నాయంటూ హర్యానా, పంజాబ్ ప్రభుత్వాలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. హర్యానా పోలీసులు పంజాబ్ సరిహద్దు పరిధిలోకి వచ్చి బారికేడ్లు ఏర్పాటు చేసినా.. పంజాబ్ ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహించిందని మండిపడ్డారు.
ప్రభుత్వ హామీతో సడలిన ఉద్రిక్తత
రైతుల ప్రధాన డిమాండ్లపై రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో మధ్యాహ్నానికి ఉద్రిక్తత కాస్త తగ్గింది. మంగళవారం అరెస్టు చేసిన రైతు సంఘాల నాయకులందరినీ వెంటనే విడుదల చేయడానికి, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం హామీ ఇచ్చింది. దీంతో పంజాబ్ రైతులు తాత్కాలికంగా సరిహద్దు నుంచి వెనుదిరిగారు. కాగా, అంబాలా, కురుక్షేత్ర తదితర హర్యానా ప్రాంతాల రైతులు మాత్రం ఢిల్లీకి తమ ప్రయాణాన్ని కొనసాగించారు.
‘దేశ్ బచావో మోర్చా’ బ్యానర్ కింద పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ రైతు సంఘాలు ఈ మహాపంచాయత్‌కు పిలుపునిచ్చాయి. పంజాబ్‌లోని కేఎంఎస్‌సీ, కిసాన్ మజ్దూర్ మోర్చా, ఆజాద్ కిసాన్ మోర్చా, బీజేయూ ఏక్తా సంఘర్ష్ శ్రేణులు శంభూ వద్ద నిలిచిపోయినట్టు కేఎమ్‌ఎస్‌సీ నేత సర్వాన్ సింగ్ పంధేర్ తెలిపారు. 2026 నాటి భారత్- యూఎస్ సంయుక్త ప్రకటన ప్రకారం ఈ ఏడాది చివర్లోగా బహుళ రంగాల వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేసేందుకు ఇరుదేశాలు సిద్ధమవుతున్నాయని పేర్కొన్నారు.
ఇది సాధారణ ఒప్పందం కాదని, వ్యవసాయం, డెయిరీ, ఈ -కామర్స్, పారిశ్రామిక రంగాలు, మేధోసంపత్తి హక్కులపై తీవ్ర ప్రభావం చూపుతుందని హెచ్చరించారు. ఒప్పందానికి సంబంధించిన అన్ని పత్రాలను తక్షణమే బహిర్గతం చేయాలని, రైతులు, ఇతర వర్గాలతో చర్చించకుండా ఎలాంటి ఒప్పందం చేసుకోవద్దని కేంద్రాన్ని ‘దేశ్ బచావో మోర్చా’ డిమాండ్ చేసింది.
రైతులను అడ్డుకోవద్దు: సీఎం భగవంత్ మాన్
పంజాబ్ రైతులను శంభూ సరిహద్దు వద్ద అడ్డుకోవడంపై పంజాబ్ సీఎం భగవంత్ మాన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్య దేశంలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని, రైతులను శాంతియుతంగా నిరసన తెలపనివ్వాలని ఆయన వ్యాఖ్యానించారు. మంగళవారం కేబినెట్ భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ఇండో–యూఎస్ ట్రేడ్ డీల్‌ను రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రైతులను అడ్డుకోవద్దని హర్యానా ప్రభుత్వాన్ని, ప్రధాని నరేంద్ర మోదీని కోరుతున్నా. గతంలో శంభూ సరిహద్దు వద్ద ఎదురైన చేదు అనుభవాలను మళ్లీ రిపీట్ చేయొద్దు’’ అని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే రైతులతో చర్చలు జరిపి, వాణిజ్య ఒప్పందంపై వారికున్న అభ్యంతరాలను, సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
