ఆఫీసులు ఇకపై ఒంటిపూటే!.. ఉద్యోగుల టైం మార్చిన ​ ప్రభుత్వం

ఆఫీసులు ఇకపై ఒంటిపూటే!.. ఉద్యోగుల టైం మార్చిన ​ ప్రభుత్వం

చండీగఢ్: పంజాబ్‌‌లోని ప్రభుత్వ ఉద్యోగుల పని వేళలు మారనున్నాయి. రాష్ట్రంలోని అన్ని గవర్నమెంట్ ఆఫీసులను ఉదయం 7.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటలకు మాత్రమే నిర్వహించాలని భగవంత్ మాన్ సర్కార్ నిర్ణయించింది. ఈ విధానం మే 2వ తేదీ నుంచి జులై 15 వరకు అమలులో ఉంటుందని స్పష్టంచేసింది. దీనివల్ల ఉద్యోగులు తమ కుటుంబాలతో గడిపే సమయం పెరగడంతోపాటు భారీగా పవర్ సేవ్ అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. 

ఎండ తీవ్రత, విద్యుత్ డిమాండ్ దృష్ట్యా ఉద్యోగుల పని వేళలు మార్చాలని నిర్ణయించినట్లు సీఎం భగవంత్ మాన్ శనివారం ఒక వీడియో రిలీజ్ చేశారు. పిల్లలకు ఒంటి పూట బడుల తరహాలోనే ప్రభుత్వ కార్యాలయాలు కూడా ఉదయం 7.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పని చేస్తాయని ప్రకటించారు. అందరితో చర్చించాకే ఈ నిర్ణయం తీసుకున్నామని సీఎం తెలిపారు. రాష్ట్రంలో విద్యుత్ గరిష్ట వినియోగం మధ్యాహ్నం 1.30 తర్వాతే మొదలవుతుందని చెప్పిన ఆయన.. ఉద్యోగుల పనివేళలు తగ్గిస్తే విద్యుత్ వాడకం తగ్గుతుందన్నారు.

2 గంటలకు ఆఫీసులను మూసేయడం వల్ల సుమారు 300 నుంచి 350 మెగావాట్ల మేర పీక్ లోడ్ తగ్గించవచ్చన్నారు. ప్రస్తుతం పంజాబ్‌‌లో గవర్నమెంట్ ఆఫీసులు ఉదయం 9 నుంచి  సాయంత్రం 5 వరకు పని చేస్తున్నాయి.