చెన్నైకి మరో ఓటమి..పంజాబ్ కు నాలుగో విక్టరీ

చెన్నైకి మరో ఓటమి..పంజాబ్ కు నాలుగో విక్టరీ

ముంబై: చెన్నై సూపర్ కింగ్స్‌‌కు మరో ఓటమి. బ్యాటింగ్, బౌలింగ్ రెండిట్లోనూ చివర్లో తడబడిన సీఎస్‌‌కే.. సోమవారం జరిగిన మ్యాచ్‌‌లో పంజాబ్ కింగ్స్ చేతిలో 11 రన్స్ తేడాతో పరాజయం పాలైంది. శిఖర్ ధవన్ (59 బాల్స్ లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 88*) హాఫ్ సెంచరీతో రాణించడంతో టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌‌కు దిగిన పంజాబ్ 20 ఓవర్లలో 187/4 స్కోరు చేసింది. చెన్నై బౌలర్లలో బ్రావో (2/42) రెండు వికెట్లు తీశాడు. ఛేజింగ్ లో అంబటి రాయుడు (39 బాల్స్ లో 7 ఫోర్లు, 6 సిక్సర్లతో 78) దంచికొట్టినా.. చివర్లో తడబడిన చెన్నై  20 ఓవర్లలో 176/6 రన్స్ చేసి ఓడింది. పంజాబ్ బౌలర్లలో రబాడ (2/23), రిషీ ధవన్ (2/39) చెరో రెండు వికెట్లు తీశారు. ధవన్‌‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్​’ లభించింది.    

పంజాబ్ అదరహో

మొదట బ్యాటింగ్‌‌లో పంజాబ్‌‌కు మంచి ఆరంభమే లభించింది. ఓపెనర్లు మయాంక్ అగర్వాల్ (18), శిఖర్ ధవన్ ఆచితూచి ఆడేందుకు ప్రయత్నించారు. ఆరో ఓవర్లో సిక్స్ బాదిన మయాంక్ ను ఔట్ చేసిన తీక్షణ (1/32) ఓపెనర్లను విడదీశాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన రాజపక్స కేవలం ఒక్క రన్‌‌కే వెనుదిరగాల్సి ఉన్నా గైక్వాడ్ క్యాచ్ మిస్ చేయడంతో బతికిపోయాడు. ఇక తొమ్మిదో ఓవర్లోనూ సాంట్నర్ బౌండరీ వద్ద క్యాచ్ మిస్ చేయడంతో ఊపిరి పీల్చుకున్న అతడు దూకుడు పెంచాడు. దీంతో పది ఓవర్లకు పంజాబ్ 72/1తో నిలిచింది. ఈ దశలో ముకేశ్ ఓవర్లో మూడు ఫోర్లతో ధవన్ ఒక్కసారిగా గేర్ మార్చాడు. ప్రిటోరియస్ బౌలింగ్ లో రాజపక్స సిక్స్ బాదగా.. ఫోర్ కొట్టిన ధవన్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆపైనా వీరిద్దరి జోరు మరింత పెరగడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. కానీ 18వ ఓవర్లో రాజపక్సను ఔట్ చేసిన బ్రావో రెండో వికెట్‌‌కు110 రన్స్ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌ బ్రేక్ చేశాడు. క్రీజులోకి వచ్చిన లివింగ్ స్టోన్(19).. 4,6,6తో మెరుపులు మెరిపించాడు. బ్రావో వేసిన చివరి ఓవర్ మొదటి బంతికి అతడు ఔటైనా.. ధవన్, బెయిర్ స్టో (6) ఈ ఓవర్లో13 రన్స్ రాబట్టి పంజాబ్ కు భారీ స్కోరు అందించారు.

రాయుడు సూపర్..

ఛేజింగ్‌‌లో చెన్నైకి మంచి ఆరంభం లభించలేదు. తొలి ఓవర్లోనే రెండు ఫోర్లతో రుతురాజ్ గైక్వాడ్(30) మంచి టచ్ లో కనిపించినా.. మరో ఎండ్ లో వరుస విరామాల్లో ఊతప్ప (1), శాంట్నర్ (9), శివం దూబే (8) వికెట్లు కోల్పోయి 40/3తో కష్టాల్లో పడింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన రాయుడు దూకుడుగా ఆడగా, గైక్వాడ్ సపోర్ట్ ఇవ్వడంతో సగం ఓవర్లకు సీఎస్ కే 69/3తో నిలిచింది. కానీ కాసేపటికే గైక్వాడ్ ను రబాడ పెవిలియన్‌‌కు పంపడంతో నాలుగో వికెట్‌‌కు 49 రన్స్ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌ ముగిసింది. అయినా రాయుడు జోరు మాత్రం తగ్గలేదు. సందీప్ ఓవర్లో రెండు ఫోర్లు, చహర్ వేసిన 15వ ఓవర్లో 4,6తో 28 బాల్స్ లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తర్వాతి ఓవర్లోనే హ్యాట్రిక్ సిక్సర్లతో పాటు ఓ ఫోర్ తో విరుచుకుపడ్డ రాయుడు చెన్నైని విక్టరీకి దగ్గర చేశాడు. అప్పటికి 24 బాల్స్‌‌లో 47 రన్స్ కావాల్సి ఉండగా.. 18వ ఓవర్లో రాయుడు ఔట్ కావడంతో మ్యాచ్ ఉత్కంఠకు దారితీసింది.  అర్షదీప్ వేసిన19వ ఓవర్లో ధోనీ (12) ఓ ఫోర్ తో పాటు మొత్తం 8 రన్స్ రాబట్టగా.. ఆఖరి 6 బాల్స్‌‌లో 27 రన్స్ అవసరమయ్యాయి. మొదటి బాల్‌‌కే సిక్స్ కొట్టిన మహీ చెన్నైని గెలిపించినట్లే అనిపించినా మూడో బంతికే ఔటవడంతో పంజాబ్ ఊపిరి పీల్చుకుంది. చివరి రెండు బాల్స్‌‌కు జడేజా (21 నాటౌట్) 6, సింగిల్ తీసినా ఫలితం లేకపోయింది. 

సంక్షిప్త స్కోర్లు 

పంజాబ్ : 20 ఓవర్లలో 187/4 ( ధవన్ 88 నాటౌట్, రాజపక్స 42, బ్రావో 2/42)  
చెన్నై: 20 ఓవర్లలో 176/6 (రాయుడు 78, రబాడ 2/23, రిషి ధవన్ 2/39) 

  • ఐపీఎల్‌‌లో 6 వేల రన్స్‌‌ చేసిన రెండో బ్యాటర్‌‌ ధవన్‌‌. అలాగే టీ20ల్లో 9 వేల రన్స్‌‌ చేసిన మూడో ఇండియన్‌‌ బ్యాటర్‌‌.