LSG vs PBKS: ప్రభ్‌సిమ్రాన్ సింగ్ విధ్వంసం.. లక్నో టార్గెట్ 237.. పూరన్, మిల్లర్ పైనే ఆశలు

LSG vs PBKS: ప్రభ్‌సిమ్రాన్ సింగ్ విధ్వంసం.. లక్నో టార్గెట్ 237.. పూరన్, మిల్లర్ పైనే ఆశలు

ఐపీఎల్ 2025 లో ప్లే ఆఫ్స్ కు ముందు కీలక మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ లో దుమ్ము లేపింది. ఆదివారం (మే 4) ధర్మశాల వేదికగా లక్నో సూపర్ జయింట్స్ పై భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ ప్రభ్‌సిమ్రాన్ సింగ్(48 బంతుల్లో 91:6 ఫోర్లు, 7 సిక్సర్లు) చెలరేగి ఆడడంతో పాటు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్(45), శశాంక్ సింగ్ (33) మెరుపులు మెరిపించారు. దీంతో పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 236 పరుగుల భారీ స్కోర్ చేసింది.  ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (91) టాప్ స్కోరర్ గా నిలిచాడు. లక్నో బౌలర్లలో ఆకాష్ మహారాజ్ సింగ్, దిగ్వేశ్ తలో రెండు వికెట్లు పడగొట్టాడు. ప్రిన్స్ యాదవ్ కు ఒక వికెట్ తీసుకున్నాడు. 

టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ కింగ్స్ ఆరంభములో వికెట్ కోల్పోయింది. ఆకాష్ మహారాజ్ తొలి ఓవర్ లోనే ప్రియాంశ ఆర్యను ఔట్ చేశాడు. మూడో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన జోష్ ఇంగ్లిస్.. మయాంక్ యాదవ్ యాదవ్ వేసిన రెండో ఓవర్లో హ్యాట్రిక్ సిక్సర్లు కొట్టి దూకుడు చూపించాడు. ఉన్నంత వరకు మెరుపులు మెరిపించి ఇంగ్లిస్ 30 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔటయ్యాడు. ఆ తర్వాత కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ తో కలిసి సిమ్రాన్ సింగ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఇద్దరూ ధాటిగా ఆడడంతో 6 ఓవర్లలో పంజాబ్ 2 వికెట్ల నష్టానికి 66 పరుగులు చేసింది.

Also Read : ఎంత ఆడితే..అంత షైన్ అవుతారు

పవర్ ప్లే తర్వాత వీరి జోరు కొనసాగింది. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కోర్ కార్డును ముందుకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో సిమ్రాన్ సింగ్ 30 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. మూడో వికెట్ కు 78 పరుగులు జోడించిన తర్వాత 45 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అయ్యర్ ఔటయ్యాడు. ఒక ఎండ్ లో వికెట్లు పడుతున్నా మరో ఎండ్ లో సిమ్రాన్ సింగ్ తన హిట్టింగ్ తో హోరెత్తించాడు. ధాటిగా ఆడే క్రమంలో 91 పరుగుల వద్ద ఔటయ్యి సెంచరీ మిస్ చేసుకున్నాడు. చివర్లో శశాంక్ సింగ్(33), మార్కస్ స్టోయినిస్(15) భారీ హిట్టింగ్ తో పంజాబ్ స్కోర్ ను 230 పరుగులు దాటించారు.