చైనా ఓపెన్‌‌‌‌ సూపర్‌‌‌‌–1000 టోర్నీలో సింధు బోణీ ఉన్నతి, సాత్విక్‌‌‌‌ జోడీ కూడా..

చైనా ఓపెన్‌‌‌‌ సూపర్‌‌‌‌–1000 టోర్నీలో సింధు బోణీ ఉన్నతి, సాత్విక్‌‌‌‌ జోడీ కూడా..

చాంగ్జౌ: ఇండియా స్టార్‌‌‌‌ షట్లర్‌‌‌‌, డబుల్‌‌‌‌ ఒలింపిక్‌‌‌‌ మెడలిస్ట్‌‌‌‌ పీవీ సింధు.. చైనా ఓపెన్‌‌‌‌ సూపర్‌‌‌‌–1000 టోర్నీలో బోణీ చేసింది. బుధవారం జరిగిన విమెన్స్‌‌‌‌ సింగిల్స్‌‌‌‌ తొలి రౌండ్‌‌‌‌లో సింధు 21–15, 8–21, 21–17తో 2022 వరల్డ్‌‌‌‌ జూనియర్‌‌‌‌ చాంపియన్‌‌‌‌, వరల్డ్‌‌‌‌ ఆరో ర్యాంకర్‌‌‌‌ టొమోకా మియాజాకీ (జపాన్‌‌‌‌)పై గెలిచి ప్రిక్వార్టర్స్‌‌‌‌లోకి ప్రవేశించింది. 62 నిమిషాల పాటు జరిగిన మూడు సెట్ల పోరాటంలో సింధు తొలి గేమ్‌‌‌‌లో దుమ్మురేపింది. వరుసగా ఏడు పాయింట్లు గెలిచి 13–5తో తొలి గేమ్‌‌‌‌లో దూసుకుపోయింది. రెండో గేమ్‌‌‌‌లో పుంజుకున్న మియాజాకీ వరుసగా 9 పాయింట్లు గెలిచి 12–8 ఆధిక్యంలో నిలిచి అదే జోరును కంటిన్యూ చేసింది.

 డిసైడర్‌‌‌‌లో ఇద్దరూ వ్యూహాత్మకంగా ఆడటంతో స్కోరు 2–2, 10–10తో సమమైంది. ఈ దశలో వరుసగా మూడు పాయింట్లు నెగ్గిన సింధు 13–10 లీడ్‌‌‌‌లోకి వెళ్లింది. మియాజాకీ ఒకటి, రెండు పాయింట్లే సాధించింది. ఇక 16–14 స్కోరు వద్ద సింధు వరుసగా నాలుగు పాయింట్లు గెలిచి ఈజీగా మ్యాచ్‌‌‌‌ను సొంతం చేసుకుంది. ఫలితంగా గతేడాది స్విస్‌‌‌‌ ఓపెన్‌‌‌‌లో మియాజాకీ చేతిలో ఎదురైన పరాజయానికి తెలుగమ్మాయి ప్రతీకారం తీర్చుకుంది. మరో మ్యాచ్‌‌‌‌లో ఉన్నతి హుడా 21–11, 21–16తో క్రిస్టీ గిల్‌‌‌‌మోర్‌‌‌‌ (స్కాట్లాండ్‌‌‌‌)పై నెగ్గింది. మెన్స్‌‌‌‌ డబుల్స్‌‌‌‌లో వరల్డ్‌‌‌‌ 15వ ర్యాంకర్లు సాత్విక్‌‌‌‌–చిరాగ్‌‌‌‌ షెట్టి 21–13, 21–9తో కెన్యా మిత్సుహషి–హిరోకి ఒకమురా (జపాన్‌‌‌‌)ను ఓడించారు. విమెన్స్‌‌‌‌ డబుల్స్‌‌‌‌లో రుతుపర్ణ–శ్వేతపర్ణ 12–21, 13–21తో టింగ్‌‌‌‌ యెంగ్‌‌‌‌–పుయ్‌‌‌‌ లామ్‌‌‌‌ యెంగ్‌‌‌‌ (హాంకాంగ్‌‌‌‌) చేతిలో ఓడారు.

మరిన్ని వార్తలు