ఉమ్మడి హైదరాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి హైదరాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

ప్రగతి భవన్ ముట్టడికి ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, డీవైఎఫ్ఐ యత్నం

ఖైరతాబాద్/మేడిపల్లి, వెలుగు : రన్నింగ్​లో క్వాలిఫై అయిన పోలీసు అభ్యర్థులందరికీ మెయిన్స్​కు అర్హత కల్పించాలని డిమాండ్  చేస్తూ ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో అభ్యర్థులు సోమవారం ప్రగతి భవన్  ముట్టడికి యత్నించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న యువజన, విద్యార్థి నేతలు, ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులు ఈ ముట్టడి యత్నంలో పాల్గొన్నారు. సిటీలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రగతి భవన్​కు ర్యాలీగా తరలిన నేతలు, అభ్యర్థులను పోలీసులు నెక్లెస్​రోడ్​లో అరెస్టు చేశారు. అనంతరం వారిని పంజాగుట్ట, ఎస్ఆర్​నగర్ పీఎస్,  గోషామహల్ స్టేడియానికి తరలించారు.చలో ప్రగతి భవన్ నేపథ్యంలో ఆదివారం అర్ధరాత్రి నుంచే రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్  నాయకులను హైదరాబాద్ రాకుండా పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. అక్రమ అరెస్టులతో తమ ఉద్యమాలను అణచివేయలేరని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ‌పుట్ట లక్ష్మణ్ అన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న సర్కారు ఇప్పటికైనా చేసిన తప్పులు సరిదిద్దుకొని, పాత నిబంధనల ప్రకారమే నియమాకాలు చేపట్టాలన్నారు.

పిల్లిని ఎత్తుకపోయిండు

వనస్థలిపురం పీఎస్​లో పెట్ ఓనర్ కంప్లయింట్

ఎల్​బీనగర్, వెలుగు: తాము ఇష్టంగా పెంచుకున్న పిల్లిని ఎవరో ఎత్తుకెళ్లిపోయారని వనస్థలిపురం పీఎస్​లో ఓ పెట్ ఓనర్ ఫిర్యాదు చేశాడు. పోలీసుల వివరాల ప్రకారం.. స్థానిక జహంగీర్ నగర్ కాలనీకి చెందిన మహమూద్ కుటుంబం18 నెలల కిందట ఓ పిల్లిని తెచ్చి పెంచుకుంటోంది. ఆ పిల్లిని ఎంతో ప్రేమగా చూసుకునేవారు. ఆదివారం రాత్రి 10 గంటల నుంచి పిల్లి కనిపించకుండా పోయింది. ఎంత వెతికినా దొరకలేదు.  బైక్​పై వచ్చిన ఓ వ్యక్తి పిల్లిని దొంగిలించుకొని పరారైనట్లు గుర్తించారు. దీంతో ఓనర్ ​జహంగీర్ పోలీసులకు కంప్లయింట్ చేశాడు. ఆ పిల్లి అరుదైన ‘ఖావ్ మనీ’ జాతికి చెందినదని.. ఓ కన్ను బ్లూ, మరో కన్ను గ్రీన్ రంగులో ఉండటం దాని ప్రత్యేకతని అని జహంగీర్ చెప్పాడు.  దాని ఖరీదు రూ.50 వేలు ఉంటుందన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

స్కూల్ మేనేజ్​మెంట్ నిర్లక్ష్యం.. విద్యార్థిని మిస్సింగ్

అల్వాల్, వెలుగు: స్కూల్​కు వెళ్లిన ఓ విద్యార్థిని మిస్సింగ్ ఘటన కలకలం రేపింది. తల్లిదండ్రులు, స్కూల్​మేనేజ్​మెంట్​కు ముచ్చె
మటలు పట్టించింది. చివరకు ఆ బాలిక ఆచూకీ దొరకడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అల్వాల్ పట్టణ పరిధి వెస్ట్ వెంకటాపురానికి చెందిన బాలిక(15) స్థానిక రోజరీ హైస్కూల్​లో  టెన్త్ క్లాస్  చదువుతోంది.  సోమవారం స్కూల్​కు వెళ్లగా.. ప్రాజెక్ట్​ వర్క్​ చేయలేదంటూ ఆ విద్యార్థినిని ఉదయం 11 గంటలకు టీచర్ బయటకు పంపించింది. బాలిక తండ్రి మధ్యాహ్నం లంచ్​ బాక్స్ ​తీసుకొని స్కూల్​కు రాగా కూతురు కనిపించలేదు. స్కూల్​నిర్వాహకులను అడిగితే ప్రాజెక్ట్​ మెటీరియల్​కోసం ఉదయమే ఇంటికి వెళ్లిందంటూ  సమాధానమిచ్చారు. బాలిక ఇంటికి వెళ్లకపోవడంతో చుట్టుపక్కల ప్రాంతాలన్నీ వెతికారు. అయినా ఆచూకీ దొరక్కపోవడంతో పోలీసులకు కంప్లయింట్ చేశారు. అంతా కలిసి వెతకగా  సాయంత్రం 6 గంటలకు వెస్ట్ ​వెంకటాపురం సమీపంలోని రైల్వే ట్రాక్ వద్ద బాలిక కనిపించింది.  
ఈ ఘటనలో స్కూల్​ మేనేజ్​మెంట్ తీరుపై తల్లిదండ్రులతో పాటు స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కూల్ వద్ద ఆందోళన చేపట్టారు. దీంతో దిగొచ్చిన స్కూల్ మేనేజ్​ మెంట్.. ఇకపై బాధ్యతగా వ్యవహరిస్తామని పేర్కొంది.

పార్కింగ్​ కాంప్లెక్స్ పనులు ఏప్రిల్​ నాటికి పూర్తికావాలి

సికింద్రాబాద్, వెలుగు: పార్కింగ్ సమస్య లేకుండా చేసేందుకు చేపట్టిన మల్టీ లెవల్ పార్కింగ్ కాంప్లెక్స్ నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేయాలని బల్దియా మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఆదేశించారు. నాంపల్లిలో హెచ్ఎంఆర్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న పార్కింగ్ కాంప్లెక్స్ పనులను జోనల్ కమిషనర్ రవికిరణ్ తో సోమవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. అధునాతన టెక్నాలజీతో అర ఎకరం స్థలంలో 15 అంతస్తుల్లో పార్కింగ్​కాంప్లెక్స్​కడుతున్నట్లు చెప్పారు. ఇందులోని10 ఫ్లోర్లు పార్కింగ్ కోసం, 5 ఫ్లోర్లు కమర్షియల్​గా వినియోగిస్తారని తెలిపారు. కమర్షియల్ స్పేస్​లో భాగంగా రెండు థియేటర్లు, ఫుడ్ కోర్టు ఉంటాయన్నారు. ఏప్రిల్ నాటికి పనులు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. అమీర్ పేట, మియాపూర్, శేరిలింగంపల్లి, బంజారాహిల్స్ లోని రద్దీ ప్రదేశాల్లో ఇలాంటి పార్కింగ్​కాంప్లెక్సులు నిర్మించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. హెచ్ఎంఆర్ జీఎం విష్ణువర్థన్ రెడ్డి మాట్లాడుతూ.. జర్మన్ టెక్నాలజీతో సెన్సార్ల ద్వారా వాహన ప్లేట్ ఆధారంగా టర్న్ టేబుల్స్ లో పార్కింగ్, టర్బో లిఫ్ట్  ద్వారా 250 కార్లు, 100 టూ వీలర్లు పార్క్​చేసేలా నిర్మిస్తున్నట్లు తెలిపారు. 2018 నాటికి రూ.50 కోట్ల అంచనా ఉండగా ప్రస్తుతం అది  రూ.70 కోట్లకు చేరిందన్నారు. మహిళలు, దివ్యాంగులకు లిఫ్ట్ సౌకర్యం కల్పించామని తెలిపారు. మానవ ప్రమేయం లేకుండా మొత్తం టెక్నాలజీ ఆధారంగా రూపొందించామన్నారు. నాంపల్లి గ్రౌండ్​లో ఏటా నిర్వహిస్తున్న నుమాయిష్​ ఎగ్జిబిషన్​ పార్కింగ్​కు ఉపయోగపడుతుందని వెల్లడించారు.

క్రియేటివ్ కంటెంట్​ను ఇష్టంగా చదువుతా

‘కథా రచన’ పుస్తకావిష్కరణలో మంత్రి కేటీఆర్

హైదరాబాద్, వెలుగు: తనకు సినిమాలంటే చాలా ఇష్టమని,  క్రియేటివ్ కంటెంట్ ఉన్న పుస్తకాలను సైతం ఇష్టంగా చదువుతానని మంత్రి కేటీఆర్ అన్నారు. సినీ డైరెక్టర్ దశరథ్ రాసిన ‘కథా రచన’ పుస్తకావిష్కరణ కార్యక్రమం బంజారాహిల్స్​లోని ప్రసాద్ ల్యాబ్స్ లో సోమవారం ఘనంగా జరిగింది. మంత్రి కేటీఆర్ చీఫ్ గెస్టుగా హాజరై పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఒక కథను మనసుకు హత్తుకునేలా చెప్పడం గొప్ప నైపుణ్యమన్నారు. అలాంటి సామర్థ్యం మంచి పుస్తకాలు చదవితేవస్తుందని ఆయన చెప్పారు. కార్యక్రమంలో భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, దర్శకులు వీవీ వినాయక్,  హరీశ్ శంకర్, నాగ్ అశ్విన్, వీఎన్ ఆదిత్య, కాశీ విశ్వనాథ్, మహేశ్ తదితరులు  పాల్గొన్నారు.