
హైదరాబాద్, వెలుగు: అత్యున్నత నాణ్యత ప్రమాణాలు పాటించిన ప్రభుత్వ దవాఖాన్లకు కేంద్రం ప్రత్యేక గుర్తింపునిస్తోంది. సర్టిఫికెట్లు జారీ చేసి, హాస్పిటల్ అభివృద్ధికి రూ.లక్షల్లో నిధులిస్తోంది. దవాఖాన సిబ్బందికి ఇన్సెంటివ్స్ ఇస్తోంది. ఇందుకోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఏరియా, జిల్లా ఆస్పత్రులకు అధికారులు ప్రత్యేక ప్రమాణాలు రూపొందించారు. నాణ్యత ప్రమాణాలను పాటించే ప్రైవేటు హాస్పిటల్స్‌కు నేషనల్ అక్రెడిటేషన్ బోర్డ్ ఫర్ హాస్పిటల్స్(ఎన్‌ఏబీహెచ్) గుర్తింపునిస్తుంది.
ఈ గుర్తింపు పొందడం గర్వకారణంగా కార్పొరేట్, ప్రైవేట్హాస్పిటళ్లు చాటుకుంటాయి. ఎన్‌ఏబీహెచ్ తరహాలోనే ప్రభుత్వ దవాఖాన్లకూ సర్టిఫికెట్లు ఇచ్చేందుకు కేంద్రం 2016లో నేషనల్క్వాలిటీ అస్యూరెన్స్స్టాండర్డ్స్(ఎన్‌క్వాష్) కార్యక్రమం ప్రారంభించింది. ఈ ప్రమాణాల్లో కనీసం 70శాతం పాటించిన దవాఖాన్లకు గుర్తింపునిస్తోంది. ఇప్పటివరకూ మన రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా హాస్పిటల్, భద్రాచలం, బాన్సువాడ ఏరియా హాస్పిటల్స్, 36 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మాత్రమే ఎన్‌క్వాష్ సర్టిఫికెట్లు పొందాయి. మరో 27 పీహెచ్‌సీలు, ఒక ఏరియా దవాఖానలో ఇటీవలే కేంద్ర బృందం ప్రమాణాలు తనిఖీ చేసి వెళ్లింది. మరో 23 పీహెచ్‌సీల తనిఖీకి ఆగస్టు తొలి వారంలో కేంద్ర అధికారులు రాష్ట్రానికి రానున్నారు.
3 దశల్లో వెరిఫికేషన్
దవాఖాన స్థాయిని బట్టి ఎన్‌క్వాష్ ప్రమాణాలు మారుతుంటాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 6 డిపార్ట్‌మెంట్లలో 1600 రకాల అంశాలను పరిగణలోకి తీసుకుంటారు. ఏరియా, జిల్లా ఆస్పత్రుల్లో 18 డిపార్ట్‌మెంట్లలో, 6625 అంశాలను పరిశీలిస్తారు. ఇందులో ఔట్ పేషెంట్, ఇన్ పేషెంట్ సర్వీస్, డయాగ్నిస్టిక్స్, మందుల లభ్యత, ఆపరేషన్ థియేటర్, లేబర్ రూమ్, హాస్పిటల్ అడ్మినిస్ర్టేషన్, పేషెంట్లకు సౌకర్యాలు, పరిశుభ్రత, పేషెంట్ల హక్కులు, బెడ్ షీట్ల పరిశుభ్రత, డాక్టర్లు, ఇతర సిబ్బంది సంఖ్య వంటి అనేక అంశాలను పరిగణలోకి తీసుకుని మార్కులు కేటాయిస్తారు.
కనీసం 70శాతం మార్కులు సాధిస్తేనే సర్టిఫికెట్ మంజూరు చేస్తారు. మొత్తం 3 దశల్లో నాణ్యత ప్రమాణాలను తనిఖీ చేస్తారు. తొలుత జిల్లాస్థాయి అధికారులు పరిశీలించాక, రాష్ట్ర స్థాయిలో ఉండే నేషనల్ హెల్త్ మిషన్ అధికారుల బృందం ఆయా దవాఖాన్లలో రెండు, మూడు రోజులుండి మరీ పరిశీలిస్తుంది. ఆపై కేంద్రం నుంచి అధికారుల బృందం వచ్చి రెండు, మూడు రోజుల పాటు పరిశీలన జరిపి, అంశాల వారీగా మార్కులు కేటాయిస్తుంది. ఈ మార్కులు 70 శాతం కంటే ఎక్కువ వస్తే ఎన్‌క్వాష్ సర్టిఫికెట్‌తో పాటు నిధులు మంజూరు చేస్తారు.