సర్కారు బడిలో సీట్ల కోసం క్యూ !

సర్కారు బడిలో సీట్ల కోసం క్యూ !
  • సర్కారు బడిలో సీట్ల కోసం క్యూ !
  • 6వ తరగతిలో 160 సీట్లకు 400 దరఖాస్తులు
  • 7 నుంచి 10 తరగతులవరకు ఖాళీలు లేకపోయినా 200 అప్లికేషన్లు

సిద్దిపేట రూరల్, వెలుగు : ప్రభుత్వ బడుల్లో సదువు సక్కగ చెప్పరని చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటు స్కూళ్లలో చదివిస్తుంటారు. కానీ, సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్ ప్రభుత్వ స్కూల్ లో మాత్రం అడ్మిషన్ కోసం తల్లిదండ్రులు పోటీ పడుతుంటారు. ఈ స్కూల్ లో అడ్మిషన్స్​ తీసుకోవడానికి సోమవారం పేరెంట్స్ క్యూ కట్టారు. 6వ తరగతిలో ఖాళీగా ఉన్న160 సీట్ల కోసం 400 దరఖాస్తులు చేసుకోవడానికి రాగా, స్కూల్​ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. అయితే ప్రభుత్వ పాఠశాలలో చదివిన 138 మందికి మొదట అవకాశం కల్పిస్తామని, తర్వాత ప్రైవేట్ స్కూల్స్​స్టూడెంట్స్​కు ఛాన్స్​ఇస్తామని హెచ్ఎం రామస్వామి తెలిపారు. ఇప్పటికే 7,8,9,10 తరగతుల్లో సీట్లు నిండిపోయినా 200 మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారన్నారు. స్కూల్​లోని ప్రతి క్లాసులో స్టూడెంట్​పై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం , ఇంట్లో సమస్యలు పిల్లల చదువుపై పడకుండా చూడడం, డిజిటల్ ల్యాబ్,  మల్టీపర్పస్ కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్స్​ ఈ స్కూల్​కు ఆకర్షితులు కావడానికి ప్రధాన కారణాలు.  ఇక్కడి స్టూడెంట్స్​కు కంప్యూటర్ , రోబోటిక్స్, గూగుల్ కోడింగ్ , యోగాల్లో స్పెషల్​ట్రైనింగ్​ఇస్తారు. అందుకే తల్లిదండ్రులు తమ పిల్లలను చేర్పించాలని తహతహలాడుతుంటారు. అయితే మరింత మంది టీచర్లు ఉంటే తమ పిల్లలందరికీ ఈ స్కూల్​లో అడ్మిషన్​ దొరుకుతుందని,  మంత్రి హరీశ్​రావు స్పందించి ఉపాధ్యాయుల సంఖ్యను పెంచాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.