
ఏ దేవుడి దగ్గరికి వెళ్లినా.. ఎన్ని పూజలు చేసినా.. ఆ విధిరాతను మాత్రం మార్చలేము... ఏ సమయానికి ఏం జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేరు.. సిగం వచ్చిన వ్యక్తిని భక్తులు సాక్షాత్తు దైవంలా భావిస్తారు. అలాంటిది సిగం ఊగుకుంటూ ఓ వ్యక్తి గుండెపోటుకు గురై ప్రాణాలు వదిలాడు.. దీంతో భక్తులంతా ఒక్కసారిగా భయంతో దేవాలయం నుంచి బయటకు పరుగులు తీశారు.. దేవుడి దగ్గరే ఇలాంటి ఘటనలు జరగడం ఏంటని.. భక్తులు వాపోతున్నారు..
కుత్బుల్లాపూర్ గాజులరామారం చిత్తరమ్మ దేవి ఉత్సవాల్లో సోమవారం(జనవరి 22) అపశృతి చోటు చేసుకుంది. సిగం ఊగుకుంటు ఓ భక్తుడు గుండె నొప్పితో ఒక్కసారిగా కుప్పకూలాడు. దేవి ఉత్సవాల్లో ఈ ఘటన చోటుచేసుకోవడంతో భక్తులు భయంతో పరుగులు పెట్టారు. ఆలయ అధికారులు ఆ భక్తుడిని వెంటనే అంబులెన్స్ లో స్థానిక ఆసుపత్రికి తరలించారు. అతన్ని పరీక్షించిన వైద్యులు.. భక్తుడు ఆసపత్రికి చేరేలోపే ప్రాణాలు కోల్పోయాడని తెలిపారు. భక్తుడి పేరు రామూగౌడ్ గా గుర్తించారు.
కాగా.. హైదరాబాద్ నగర శివార్లలోని గాజులరామారంలో కొలువైన చిత్తారమ్మ దేవి జాతర ఘనంగా ప్రారంభమైంది. నిన్న ఆదివారం(జనవరి 21) తెల్లవారుజాము నుంచే అమ్మవారి ఆలయానికి భక్తులు తరలివస్తున్నారు. ఆదివారం కావడంతో ప్రజలు ఉత్సవాల్లో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున హాజరయ్యారు. చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా దేవి ఉత్సవాల్లో పాల్గొన్నారు. భక్తి శ్రద్దలతో దేవిని చూసి పులకించిపోయారు. అమ్మవారిని కన్నులారా చూసి తరించిపోయారు. బోనాలు సమర్పిస్తూ.. మొక్కులు తీర్చుకుంటున్నారు భక్తులు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అమ్మవారి దర్శనానికి ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.