బిల్డింగ్ ఎత్తు పెంచాలనుకుని..పక్క బిల్డింగ్కు ఎసరు తెచ్చాడు..

బిల్డింగ్ ఎత్తు పెంచాలనుకుని..పక్క బిల్డింగ్కు ఎసరు తెచ్చాడు..

జాకీలతో ఇంటి ఎత్తును పెంచాలనే ప్రయత్నం బెడిసి కొట్టింది. ఆ భవనం మరో ఇంటిపై ఒరగడంతో అందులో నివాసముంటున్న వారు ప్రాణభయంతో బయటకు పరుగులు తీసిన సంఘటన మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కుత్బుల్లాపూర్ లో చోటు చేసుకుంది.  

స్థానిక శ్రీనివాసనగర్‌ కాలనీకి చెందిన నర్సింహారావు 25 సంవత్సరాల క్రితం జీ ప్లస్‌ 2 విధానంలో ఇంటిని నిర్మించాడు. అయితే ప్రస్తుతం ఆ బిల్డింగ్ దగ్గర రోడ్డు ఎత్తు పెరిగింది. దీంతో వర్షం కురిసినప్పుడల్లా  నర్సింహారావు ఇంట్లోకి వరద నీరు వచ్చేది.  దీంతో తెలిసిన వారి సూచనల మేరకు నర్సింహారావు తన బిల్డింగ్ ఎత్తును పెంచాలని నిర్ణయించుకున్నాడు. ఈ పనులను ఆంధ్రప్రదేశ్‌ లోని విజయవాడకు చెందిన ఓ కాంట్రాక్టర్ కు అప్పగించాడు. 

అపార్ట్ మెంట్ లో యజమాని కుటుంబంతో సహా ఆరు కుటుంబాలు నివాసముంటున్నాయి. బిల్డింగ్ మరమ్మతులు మొదలైన తర్వాత రెండు కుటుంబాలు ఖాళీ చేశాయి. ఆ తర్వాత మరో రెండు కుటుంబాల సమీపంలో ఉన్న ఇళ్లకు మారాయి. ప్రస్తుతం యజమాని కుటుంబంతో పాటు మరో కుటుంబం అందులోనే ఉంటోంది. అయితే బిల్డంగ్ ఎత్తు పెంచేందుకు వినియోగించిన హైడ్రాలిక్‌ జాకీలు అదుపు తప్పాయి. దీంతో ఒక్కసారిగా పక్కనున్న మరో భవనంపైకి ఆ భారీ భవనం ఒరిగిపోయింది.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అనుమతులు లేకుండా మరమ్మతులు చేపట్టిన ఇంటి యజమాని నర్సింహారావుపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం మరమ్మతులు జరుగుతున్న భవనం పక్కన ఉన్న  భవనంపై ఒరిగిపోవడంతో ఆ భవనాన్ని కూాడా కూల్చాలని అధికారులు సూచించారు. 

నర్సింహరావు భవనాన్ని పైకి లేపే ప్రయత్నంలో తమ భవనానికి ముప్పు రావడంపై పక్క ఇంటి యజమాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాడు.