- ప్రధానికి ఎంపీ ఆర్. కృష్ణయ్య విజ్ఞప్తి
న్యూఢిల్లీ, వెలుగు: పార్లమెంట్‌లో బీసీ బిల్లును ప్రవేశపెట్టి వారికి చట్టసభల్లో 50 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని ప్రధాని మోదీని ఎంపీ ఆర్. కృష్ణయ్య కోరారు. అలాగే.. ఒక్కొక్క కుటుంబానికి 80 శాతం సబ్సిడీతో రూ. 20 లక్షల రుణాలు ఇవ్వాలని, ప్రధానమంత్రి విశ్వకర్మ స్కీమును విస్తరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం ప్రధాని మోదీని పార్లమెంట్లోని ఆయన చాంబర్లో ఆర్. కృష్ణయ్య కుటుంబ సమేతంగా కలిశారు.
బీసీల సమస్యలను మరోసారి ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. అయితే, బీసీల డిమాండ్లు న్యాయమైనవి, దశల వారీగా పరిష్కరిస్తామ ని ప్రధాని హామీ ఇచ్చినట్టు ఆర్.కృష్ణయ్య ఓ ప్రకటనలో తెలిపారు. అన్నీ రంగాల్లో సమాన వాటా ఇచ్చే ప్రక్రియ ప్రారంభమైందని మోదీ భరోసా ఇచ్చినట్టు పేర్కొన్నారు. అనంతరం ఆర్.కృష్ణయ్య మనవళ్లు రిషి నందన్, రిత్విక్ నందన్, మనవరాళ్లు అక్షర, కృత్రిక తో ప్రధాని మోదీ సుమారు 20 నిమిషాలు సరదాగా గడిపారు.
మనవడు గీసిన ప్రధాని మోదీ ఫొటోలు, మనవరాలు గీసిన చిత్రాలను ప్రధానికి బహూకరించారు. చిన్నారులకు మోదీ ఇచ్చారు. కాగా.. కుమారుడికి బీసీ ఉద్యమాన్ని అప్పగించాలని ప్రధాని మోదీ సూచించినట్టు ఆర్. కృష్ణయ్య మీడియాకు చెప్పారు.
