అక్రమాస్తులను స్వాధీనం చేసుకుని స్టూడెంట్ల ఫీజు బకాయిలు చెల్లించాలి

అక్రమాస్తులను స్వాధీనం చేసుకుని స్టూడెంట్ల ఫీజు బకాయిలు చెల్లించాలి
  • లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం
  • 13 బీసీ సంఘాల సమావేశంలో ఎంపీ ఆర్.కృష్ణయ్య

ముషీరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్​పెట్టిన రూ.7వేల కోట్ల ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. ప్రజా ధనాన్ని దోచుకున్న నాయకులు, ఉన్నతాధికారులపై సమగ్ర విచారణ జరిపించి, అక్రమాస్తులను స్వాధీనం చేసుకోవాలని సూచించారు. వాటిని వేలం వేసి, స్టూడెంట్ల ఫీజు బకాయిలు చెల్లించాలని కోరారు.

గురువారం విద్యానగర్​లోని బీసీ భవన్ లో బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు సి.రాజేందర్, నీల వెంకటేశ్​ఆధ్వర్యంలో13 బీసీ సంఘాల సమావేశం జరిగింది. ఆర్.కృష్ణయ్య పాల్గొని మాట్లాడారు. మూడేండ్లుగా రాష్ట్ర ప్రభుత్వం స్టూడెంట్లకు ఫీజులు చెల్లించడం లేదని చెప్పారు. సీఎం రేవంత్​రెడ్డి స్పందించి వెంటనే చెల్లించాలని కోరారు.

ఫీజులకు బడ్జెట్​రిలీజ్ చేయకపోవడంతో కాలేజీ యాజమాన్యాలు స్టూడెంట్లను ఒత్తిడి చేస్తున్నాయని, తల్లిదండ్రులు అప్పులు చేసి ఫీజులు కడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే బీసీ సంఘాలు, విద్యార్థి సంఘాలతో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. సమావేశంలో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు అంజి, రామకోటి, లక్ష్మీనారాయణ, సాయిలు యాదవ్, బలరామ్  పాల్గొన్నారు.