మీర్‌పేట గ్యాంగ్ రేప్ కేసులో.. ఆరుగురు నిందితుల అరెస్టు

మీర్‌పేట గ్యాంగ్ రేప్ కేసులో.. ఆరుగురు నిందితుల అరెస్టు

మీర్ పేటలో బాలిక గ్యాంగ్ రేప్ కేసులో సంచలన విషయాలు బయటపడ్డాయి. ఈ కేసులో ఆరుగురిని అరెస్టు చేసినట్లు రాచకొండ సీపీ డీఎస్‌ చౌహాన్‌ తెలిపారు. మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు చెప్పారు. రాచకొండ సీపీ చౌహాన్ తెలిపిన వివరాల ప్రకారం.. నిందితులపై పోక్సో యాక్టు, సెక్షన్‌ 5జీ రెడ్‌విత్‌ 6 కింద కేసులు నమోదు చేసినట్లు సీపీ చౌహాన్ చెప్పారు. ప్రధాన నిందితుడు మంగళ్‌హాట్‌లో రౌడీషీటర్‌గా ఉన్నాడని పేర్కొన్నారు. 

ఈ కేసులో అష్రఫ్‌, చిన్నా, మహేశ్‌, తహిసీన్‌ అనే నలుగురు అత్యాచారాని పాల్పడిన తర్వాత రేసుకోర్సు వెనకవైపు ఉన్న ఫైజల్‌, ఇమ్రాన్‌ దగ్గరికి వెళ్లారని సీపీ వివరించారు. వారి మొబైల్స్‌ తీసుకొని రెండు, మూడు కాల్స్‌ చేసుకొని డిలీట్‌ చేశారు. అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించారని తెలిపారు. ఆ తర్వాత ఉమ్నాబాద్‌ వరకు వెళ్లి.. అక్కడ రెండు పోలీసు బృందాలు గస్తీ నిర్వహిస్తుండటం చూసి.. తిరిగి వెనక్కి వచ్చేశారని పేర్కొన్నారు. నిందితులను పట్టుకోవడానికి మొత్తం 12 బృందాలను వినియోగించామని... ఈ క్రమంలో వివిధ చోట్ల ఆరుగురు పోలీసులకు చిక్కారని సీపీ చౌహాన్‌ తెలిపారు.

ఏం జరిగిందంటే..

మీర్ పేటలో గంజాయి మత్తులో ఉన్న ముగ్గురు యువకులు కత్తులతో బాలికను బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డారు. శనివారం(ఆగస్టు 19)  మీర్ పేట పరిధిలోని తన సోదరి ఇంటికి తమ్ముడితో కలిసి బాధిత బాలిక వచ్చింది. అదేరోజు స్థానిక యువకుడు ఆమెపై లైంగిక వేధింపులకు ప్రయత్నించడంతో అడ్డుకుంది. దీంతో అతడు మరో ఏడుగురితో కలిసి సోమవారం(ఆగస్టు 21) ఉదయం బాలిక సోదరి ఇంట్లోకి కత్తులతో వచ్చి బెదిరించాడు. 

గంజాయి మత్తులో ఉన్న దుండగులు ఇంట్లోని వారిపై దాడి చేశారు. ఆ తర్వాత ముగ్గురు యువకులు బాలికపై అత్యాచారం చేశారు. ఆమె తమ్ముడి ముందే ఈ దారుణానికి పాల్పడ్డారు. తర్వాత అక్కడి నుంచి పరారయ్యారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనా స్థలాన్ని రాచకొండ సీపీ చౌహాన్ పరిశీలించారు. బాధితురాలి నుంచి వివరాలు సేకరించారు.