సమోసా నుంచి ఫోన్ రీచార్జ్ అక్రమాల వరకు.. సామాన్యుల సమస్యలపై మాట్లాడుతూ ఫేమస్ అయిన రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా బీజేపీ తీర్థం పుచ్చుకున్న నాటి నుంచి తన స్వరం మార్చేశారు. ప్రజాసమస్యలపై దాదాపు మాట్లాడటమే మానేశారు. బీజేపీలో చేరగానే చద్దా మారిపోయారని.. ప్రజాసమస్యలపై గొంతు విప్పడం లేదని.. ప్రభుత్వ తప్పులు ఆయనకు కనిపించడం లేదా అంటూ విమర్శలు మొదలయ్యాయి. నీట్ పేపర్ లీక్ అంశంలో వేలాది విద్యార్థులు పార్లమెంటు వీధుల్లో నిరసనలు తెలుపుతుంటే.. ఒక్క మాట కూడా మాట్లాడకపోవడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి.
విమర్శలపై ఎట్టకేలకు చద్దా మాట్లాడారు. శుక్రవారం (జులై 31) రాజ్యసభలో యాంటీ పేపర్ లీక్ బిల్లుపై మాట్లాడిన ఆయన.. మీడియా సౌండ్ బౌట్స్ కాదని.. సంస్థాగత మార్పులు రావాల్సి ఉందని అన్నారు. తనపై విమర్శలు చేస్తున్న కాంగ్రెస్, ఆప్ పార్టీలకు సమాధానం చెబుతూ.. తను ప్రతిపక్షం నుంచి అధికార పక్షంలో ఉన్నానని.. తన ఫోకస్ ఇప్పుడు పరిష్కారం చూపడంపైనే అని అన్నారు.
గతంలో నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ప్రశ్నలు లేవనెత్తడం నా పని, నేను దానిని నిజాయితీగా చేశాను. ఇప్పుడు నేను అధికార పక్షంలో ఉన్నాను, కాబట్టి నా పాత్ర మారింది. నా బాధ్యత ఇకపై ప్రశ్నలు అడగడం కాదు, పరిష్కారాలు అందించడం అని ఆయన అన్నారు.
తనకు హైడ్ లైన్స్ ఇవ్వడం, కెమెరాల ముందు మాట్లాడి అటెండెన్స్ వేసుకోవాల్సిన అవసరం లేదని, కేవలం ఫలితం మాత్రమే కావాలని చద్దా అన్నారు. మనం ఒక పరిష్కారాన్ని కనుగొని, వ్యవస్థను సరిదిద్దినప్పుడు మాత్రమే పార్లమెంటులో ఈ విషయం గురించి మాట్లాడతానని నాకు నేను వాగ్దానం చేసుకున్నాను. వ్యవస్థను సరిదిద్దుతున్న ఆ చారిత్రాత్మక రోజు ఈరోజే అని ఆయన అన్నారు.
నీట్ లీక్ పై నిరసన చేస్తున్న విద్యార్థుల నిరాశ, కోపం సమర్థనీయమైనదేనని అన్నారు. పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలనే ఆశతో ఆశావహులు కోటా, ఢిల్లీ వంటి సుదూర నగరాలకు వెళ్తారని, కోచింగ్ సెంటర్ల కోసం తమ సామాజిక, కుటుంబ జీవితాన్ని, తల్లిదండ్రుల బడ్జెట్‌ను పణంగా పెడతారని అన్నారు. విద్యార్థుల ఆందోళనలను విన్న తర్వాత కేంద్రం వేగంగా చర్యలు తీసుకుందని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సంరక్షకుడిలా వ్యవహరించారని మాజీ ఆప్ ఎంపీ అన్నారు.
Also Read : ఆయన త్యాగం మరువలేనిది.. మా మధ్య పుల్లలు పెట్టొద్దు
భవిష్యత్ నీట్ పరీక్షలను ఓఎంఆర్ షీట్లకు బదులుగా కంప్యూటర్ ఆధారిత విధానం ద్వారా నిర్వహిస్తామని ప్రకటించారు. తన ప్రసంగంలో, పేపర్ లీక్‌లను రాజకీయ కోణంలో చూడకూడదని, ఇది ఒక దీర్ఘకాలిక వ్యాధి లాంటిదని నొక్కి చెప్పారు. పార్టీ రాజకీయాల కంటే జవాబుదారీతనం, నైతిక విలువలే ముఖ్యమని, పేపర్ లీక్ ఏ రాష్ట్రంలో జరిగిందనేది, ఏ మంత్రి అధికారంలో ఉన్నారనేది, లేదా ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉందనేది ముఖ్యం కాదన్నారు.
