మోదీ రాజ్యంలో దళితులకు ఉద్యోగాల్లేవ్: రాహుల్ గాంధీ

మోదీ రాజ్యంలో దళితులకు ఉద్యోగాల్లేవ్: రాహుల్ గాంధీ

కాన్పూర్/ఉన్నావ్ :  మోదీ రామరాజ్యంలో దళితులపై వివక్ష కొనసాగుతుందని, 90% ఉన్న వారికీ ఉద్యోగాలు దొరకట్లేదని ఇదెక్కడి రామరాజ్యం అని  కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ ప్రశ్నించారు. బుధవారం కాన్పూర్ లో చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్రలో రాహుల్ గాంధీ మాట్లాడారు. “జనాభాలో 90 శాతానికి పైగా ఉన్న వెనుకబడిన వర్గాలు, దళితులు, గిరిజనులు, మైనారిటీలకు ఉద్యోగాలు దొరకట్లేదు. దేశంలోని 50 శాతం జనాభా వెనుకబడిన వర్గాలకు చెందినవారు. 

15 శాతం దళితులు, 8 శాతం గిరిజనులు, 15 శాతం మైనారిటీలే ఉన్నారని చెప్పారు. వెనుకబడిన వర్గాలు, దళితులు, గిరిజనులు, పేద జనరల్ కేటగిరీకి చెందిన వారైతే ఎంత అరిచినా మీకు ఉద్యోగం రాదు. మీకు ఉద్యోగాలు రావడం నరేంద్ర మోదీకి ఇష్టం లేదు. భారత్ లో వర్గ, కులాల మధ్య విభేదాలు ఉన్నాయి. దళితులు, వెనుకబడిన వర్గాల వారికీ మీడియా, భారీ పరిశ్రమలు, బ్యూరోక్రసీలో ప్రాతినిధ్యం వహించడానికి ఎవరూ లేరు. దేశ ప్రజలు ఆకలితో చనిపోతున్నారు. అయోధ్యలో రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ వేడుకను చూసే ఉంటారు. ఈ ఉత్సవంలో పాల్గొన్న వారిలో వెనుకబడిన తరగతులకు చెందిన వారు ఎంత మంది..? దళితులు, గిరిజన కేటగిరీకి చెందిన వారు ఎంత మంది..? ఆదివాసీ మహిళ, రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కూడా ఆహ్వానించలేదు. దళిత కేటగిరీకి చెందిన మాజీ ప్రెసిడెంట్ రామ్ నాథ్ కోవింద్ ను కూడా లోపలికి అనుమతించలేదు. భారత్ పురోగతికి కులాల వారీ జనాభా గణన అనేది అతిపెద్ద విప్లవాత్మక అడుగు. జనాభాలో రెండు, మూడు శాతం ఉన్న అదానీ, అంబానీ, టాటా, బిర్లా వంటి వారు మెగా మహారాజులై  మిమ్మల్ని పరిపాలిస్తున్నారు” అని రాహుల్ గాంధీ చెప్పారు.

న్యాయ్​ యాత్రకు బ్రేక్  

భారత్ జోడో న్యాయ్ యాత్రకు రాహుల్ గాంధీ ఫిబ్రవరి 26 నుంచి మార్చి 1 వరకు ఐదు రోజుల పాటు బ్రేక్ ఇచ్చారు. ఈ  విరామ సమయంలో కేంబ్రిడ్జిలో ప్రసంగించనున్నారు. న్యూఢిల్లీలో జరిగే కొన్ని ముఖ్యమైన సమావేశాల్లో పాల్గొననున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరాం రమేశ్ తెలిపారు.