రాహుల్ యాత్రలో పాల్గొన్నాం అని చెప్పుకునేలా చేస్తాం

రాహుల్ యాత్రలో పాల్గొన్నాం అని చెప్పుకునేలా చేస్తాం
  • రాహుల్ యాత్ర కోఆర్డినేషన్ కోసం రెండు రాష్ట్రాలతో కమిటీ
  • పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

హైదరాబాద్: కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో పాదయాత్ర చరిత్రలో నిలిచిపోయే యాత్ర అవుతుందని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. భారత్ జోడో.. గాంధీ చేపట్టిన దండియాత్ర లాంటిదేనని ఆయన అన్నారు. ఈనెల 24వ తేదీ నుంచి తెలంగాణలో రాహుల్ గాంధీ పాదయాత్ర మొదలవుతుందని ఆయన తెలిపారు. యాత్రను సమన్వయం చేసుకునేందుకు మహారాష్ట్ర నేతలు రావడం సంతోషకరం అన్నారు. భారత్ జోడో యాత్ర రూట్ పర్యవేక్షణ కోసం వారు వచ్చారని రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఈనెల 24 నుంచి రాష్ట్రంలో14 రోజులు కొనసాగిన తర్వాత సరిహద్దులోని నాందేడ్ వద్ద మహారాష్ట్రలోకి రాహుల్ యాత్ర ప్రవేశిస్తుందని వివరించారు. 

సమన్వయం చేయడానికి సమావేశం 

రాహుల్ పాదయాత్రను సమన్వయం చేసుకోవడంలో భాగంగా ఇవాళ రెండు రాష్ట్రాల నేతలు కలిసి మాట్లాడుకున్నామని, ప్రాధమికంగా ఒక అంచనాకు వచ్చామని రేవంత్ రెడ్డి తెలిపారు. కో ఆర్డినేషన్ కోసం రెండు రాష్ట్రాల నేతలతో ఒక కమిటీ వేయాలని నిర్ణయం తీసుకున్నామని, ఎందుకంటే రెండు రాష్ట్రాల్లో ఒకే రకమైన ప్రజాసమస్యలున్నాయన్నారు. అంతేకాదు మహారాష్ట్ర, తెలంగాణ నేతలు కలిసి కర్ణాకట యాత్రను సందర్శించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. అక్కడ ఏర్పాట్లు ఎలా చేస్తున్నారని పరిశీలిస్తామని చెప్పారు. రాహుల్ యాత్రకు పెద్ద ఎత్తున మద్దతు వస్తుందని.. చరిత్రలో నిలిచిపోయే యాత్ర అవుతుందని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఒకరకంగా చెప్పాంటే రాహుల్ భారత్ జోడో యాత్ర గాంధీ చేపట్టిన దండియాత్ర లాంటిదేనని.. చరిత్రలో ప్రజలు కూడా రాహుల్ యాత్రలో పాల్గొన్నాం అని చెప్పుకునేలా చేస్తామని రేవంత్ రెడ్డి అన్నారు.