
రాహుల్ గాంధీ ‘భారత్ జోడో’ యాత్ర తెలంగాణలో మళ్లీ గురువారం నుంచి ప్రారంభం కానుంది. ఉదయం 6.30 గంటల నుంచి భారత్ జోడో యాత్రను రాహుల్ గాంధీ కొనసాగిస్తారు. పాదయాత్రను నిలిపివేసిన మక్తల్ నుంచే యాత్రను తిరిగి ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా రాహుల్ గాంధీ బుధవారమే మక్తల్కు చేరుకుంటారు. ఈ నెల 23 న రాయచూర్ నుంచి రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్ర తెలంగాణలోకి ప్రవేశించింది. అయితే ఒక్కరోజు యాత్ర చేసిన రాహుల్ గాంధీ...కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఖర్గే ప్రమాణ స్వీకారోత్సవంతో పాటు దీపావళి కోసం మూడు రోజులు బ్రేక్ తీసుకున్నారు. తిరిగి గురువారం ఉదయం నుంచి యాత్ర మొదలుపెట్టనున్నారు.
27న యాత్ర ఎక్కడి నుంచి ఎక్కడి వరకు..
మక్తల్ నుంచి యాత్రను ప్రారంభించనున్న రాహుల్‌గాంధీ తొలుత కన్యాకాపరమేశ్వరీ ఆలయాన్ని దర్శించుకుంటారు. అనంతరం పెద్దచెరువు, దండు క్రాస్, గొల్లపల్లి క్రాస్‌రోడ్డు, కాచ్‌వార్ మీదుగా జక్లేర్ వరకు యాత్ర చేస్తారు. అక్కడ మధ్యాహ్న భోజనం చేస్తారు. ఆ తర్వాత కొద్దిసేపు విరామం తీసుకుని.. తిరిగి సాయంత్రం 4 గంటలకు యాత్రను ప్రారంభిస్తారు. జక్లేర్ ఎక్స్‌రోడ్, గుడిగండ్లలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్‌లో పాల్గొంటారు. ఈ మీటింగ్ తర్వాత ఎలిగండ్లలోని బాలాజీ ఫ్యాక్టరీ సమీపంలో రాహుల్ బస చేయనున్నారు.
16 రోజుల పాటు యాత్ర
తెలంగాణలో రాహుల్ గాంధీ 16 రోజుల పాటు యాత్ర చేయనున్నారు. మొత్తం 19 అసెంబ్లీ, 7 పార్లమెంట్ నియోజకవర్గాల మీదుగా 375 కిలోమీటర్లు నడవనున్నారు. ఈ యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ పలు ప్రాంతాల్లో మీటింగ్‌లలో పాల్గొననున్నారు. రోజుకు సగటున 20 నుంచి 25 కిలోమీటర్ల మేరకు పాదయాత్ర చేయనున్నారు. యాత్ర కోసం తెలంగాణ కాంగ్రెస్ ఏర్పాట్లు పూర్తి చేసింది. యాత్రను సమన్వయం చేసేందుకు రాష్ట్ర కాంగ్రెస్ 10 ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసింది.
సెప్టెంబర్ 7 నుంచి యాత్ర
సెప్టెంబర్ 7న తమిళనాడులోని కన్యాకుమారిలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను ప్రారంభించారు. తమిళనాడు, కేరళ, ఏపీ, కర్ణాటకలలో భారత్ జోడో యాత్రను పూర్తి చేసిన రాహుల్... తెలంగాణలోకి ఈనెల 23న ప్రవేశించారు.