న్యూఢిల్లీ: సర్ ప్రక్రియలో అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగిన యువజన కాంగ్రెస్, ఎన్ఎస్యూఐ మహిళా కార్యకర్తలపై ఢిల్లీ పోలీసులు అత్యంత క్రూరంగా ప్రవర్తించారని కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. పోలీసులు కొట్టడంతో ఢిల్లీ యూనివర్సిటీలో చదువుతున్న కేరళ రాష్ట్రానికి చెందిన ఎన్ఎస్యూఐ కార్యకర్త ఆథిరా అనే విద్యార్థినిని వినికిడి శక్తిని కోల్పోయిందని.. ఆమె ఒక చెవి పని చేయడం లేదని ఆరోపించారు.
సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగిన కొందరు ఎన్ఎస్యూఐ కార్యకర్తలు గాయపడ్డారు. బుధవారం (అక్టోబర్ 14) రాహుల్ గాంధీ వారితో సమావేశమయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులను, ముఖ్యంగా మహిళా కార్యకర్తలను మహిళా పోలీసులు లేకుండా బస్సుల్లో తరలించి, కస్టడీలో క్రూరంగా కొట్టడం అత్యంత హేయమైన చర్య అని విమర్శించారు.
నిరసనల సమయంలో పోలీసులు, బీజేపీ, ఆర్ఎస్ఎస్ గుండాలు చేస్తోన్న దాడులను వీడియో రికార్డ్ చేసి పెట్టుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఈ విషయం ఇక్కడితో ముగిసిపోదని.. ప్రధాని మోడీ నుంచి కానిస్టేబుల్ వరకు బాధ్యులైన ఎంతటి వారైనా భవిష్యత్తులో చట్టపరంగా వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. విద్యార్థులపై దాడులు చేస్తే ఊరుకోమని వార్నింగ్ ఇచ్చారు.
విద్యార్థులు, యువత, ప్రతిపక్షాలు చేస్తోన్న ఈ ఆందోళనలు కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం కాదని.. ఇది రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి చేస్తోన్న పవిత్రమైన పోరాటమని పేర్కొన్నారు. ప్రభుత్వ లాఠీలు ఒక సమూహాన్ని తాత్కాలికంగా ఆపగలవేమో కానీ.. యువత నుంచి వస్తున్న న్యాయమైన ప్రశ్నలను ఎప్పటికీ ఆపలేవని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ALSO READ : నడి రోడ్డుపై లాయర్ చెంప చెళ్లుమనిపించిన లేడీ డీసీపీ అంజూ..
సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ యూనివర్శిటీకి చెందిన కాంగ్రెస్ అనుబంధ సంస్థ ఎన్ఎస్యూఐ విద్యార్థులు అక్టోబర్ 12న జంతర్ మంతర్ లో మెరుపు ధర్నాకు దిగారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలను ఎన్ఎస్యూఐ కార్యకర్తలను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ క్రమంలో తమను అదుపులోకి తీసుకుని బస్సులో తరలిస్తున్నప్పుడు మహిళా పోలీసులు ఎవరూ లేరని, ఆ విషయమై ప్రశ్నించినందుకు కన్నాట్ ప్లేస్ పోలీస్ స్టేషన్ వెలుపల పోలీసులు తన ముఖం, చెంపలపై బలంగా కొట్టారని ఎన్ఎస్యూఐ మహిళా కార్యకర్త ఆథిరా ఆరోపించారు.
