న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా విమానం నుంచి హైజాక్ (స్క్వాక్-7500) కోడ్ హెచ్చరికలు రావడం తీవ్ర కలకలం రేపింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు విమానాన్ని జైపూర్కు దారి మళ్లించి ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. అధికారుల వివరాల ప్రకారం.. ఎయిర్ ఇండియాకు చెందిన ఏఐ-2030 విమానం బుధవారం (అక్టోబర్ 14) ఫ్రాంక్ఫర్ట్ నుంచి ఢిల్లీ బయలుదేరింది.
అహ్మదాబాద్ ఏటీసీ పరిధిలో ఉన్న సమయంలో విమానం నుంచి కొన్ని సెకన్ల పాటు అహ్మదాబాద్ ఏటీసీకి హైజాక్ (స్క్వాక్-7500) హెచ్చరికలు అందాయి. దీంతో వెంటనే భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి. హైజాక్ హెచ్చరిక కారణంగా విమానాన్ని జైపూర్ విమానాశ్రయానికి మళ్లించి అత్యవసర ల్యాండింగ్ చేశారు.
అనంతరం విమానాన్ని ప్రత్యేక ఐసోలేషన్ బేకు తరలించారు. పైలట్ పొరపాటున విమాన హైజాక్ కోడ్ (స్క్వాక్-7500)ను నొక్కినట్లు సమాచారం. అయితే, పైలట్ ఈ ఆరోపణలను ఖండించాడు. విమానంలో సాంకేతిక సమస్య తలెత్తిందని.. అందుకే ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం అనుమతి కోరినట్లు తెలిపాడు.
దీంతో హైజాక్ కోడ్ ఎలా యాక్టివేట్ అయ్యిందనేది సస్పెన్స్గా మారింది. ఈ నేపథ్యంలో హైజాక్ హెచ్చరిక ఎలా యాక్టివేట్ అయింది, స్క్వాక్ 7500 కోడ్ను ఎవరూ ట్రిగ్గర్ చేశారో నిర్ధారించడానికి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) దర్యాప్తును ప్రారంభించింది. ఇన్వెస్టిగేషన్ తర్వాత దీనిపై క్లారిటీ వస్తుందని అధికారులు తెలిపారు.
