మధ్యప్రదేశ్లోని అజ్నార్ నదిని ఎనిమిది నెలల పాటు కష్టపడి శుభ్రం చేసిన బిట్టు తబాహికి చివరికి నిరాశే ఎదురైంది. నదిని శుభ్రం చేసిన కొన్ని వారాలకే అక్కడ మళ్లీ ప్లాస్టిక్ కవర్లు, ఇతర చెత్త పేరుకుపోవడంతో అతను ఆవేదన వ్యక్తం చేశారు. నది పరిస్థితిని చూపిస్తూ సోషల్ మీడియాలో ఓ వీడియోను షేర్ చేశారు.
బిట్టు తబాహి పేరుతో గుర్తింపు పొందిన సురేంద్ర సింగ్ చౌదరి నదులను శుభ్రం చేసే పనితో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా మంగళవారం ఆయన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన వీడియోలో రాజ్గఢ్ జిల్లాలోని అజ్నార్ నది దుస్థితిని చూపించారు. నెలల తరబడి కష్టపడి శుభ్రం చేసిన నది మళ్లీ చెత్తతో నిండిపోవడం చూసి అతను బాధపడ్డారు.
కొన్ని వారాల క్రితం వరకు నది పరిసరాలు శుభ్రంగా కనిపించేవి. కానీ ఇప్పుడు నదిలో ఒడ్డున ప్లాస్టిక్ కవర్లు, ఇతర వ్యర్థాలు పేరుకుపోయాయి. దీంతో బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయడం పట్ల ప్రజలకు బాధ్యత లేదా ? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
నది పరిస్థితిని చూసిన బిట్టు తబాహి తన బాధను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసారు. “నా ఎనిమిది నెలల కష్టమంతా ఇలా వృథా అవుతుందని నేను ఎప్పుడూ అనుకోలేదు” అని ఆయన వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. గతంలో ఆయన ఎలాంటి ఆధునిక పరికరాలు లేకుండానే దాదాపు ఎనిమిది నెలల పాటు ఒంటరిగా శ్రమించి నదిలో పేరుకుపోయిన టన్నుల కొద్దీ చెత్తను తొలగించారు. అయినా కొద్ది రోజులకే నది మళ్లీ అదే పరిస్థితికి చేరుకోవడం అతనిని నిరాశకు గురిచేసింది.
అయితే, అతను వెనక్కి తగ్గలేదు. మళ్లీ నదిలోకి దిగి చెత్తను తొలగించడం ప్రారంభించారు. వీడియోలో చెత్తను సంచుల్లో సేకరించి బయటకు తీస్తున్న దృశ్యాలు కనిపించాయి. నదిని శుభ్రం చేయడంతో పాటు, భవిష్యత్తులో చెత్త పేరుకుపోకుండా ఏం చేయాలనే విషయంపై కూడా బిట్టు తబాహి నెటిజన్ల సలహాలు కోరారు. ఎంత కష్టపడి నదిని శుభ్రం చేసినా, ప్రజలు మళ్లీ చెత్త వేస్తే పరిస్థితి మారదని ఆయన ప్రయత్నం ద్వారా స్పష్టమవుతోంది.
బిట్టు తబాహికి నెటిజన్ల మద్దతు
ఈ వీడియో చూసిన నెటిజన్లు బిట్టు తబాహి కృషిని ప్రశంసించారు. అదే సమయంలో నదిని శుభ్రం చేసిన తర్వాత కూడా ప్రజలు మళ్లీ చెత్త వేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ALSO READ : ఢిల్లీ పోలీసుల క్రూరత్వం..
ఓ నెటిజన్ స్పందిస్తూ.. “ఇది చాలా బాధాకరం. అయినా మీరు నిజమైన హీరో. మీకు మరింత శక్తి రావాలి” అని కామెంట్ చేశారు. మరో వ్యక్తి.. “వంతెన కింద నీటిలో ఇంత చెత్త తేలుతూ ఉండటం చూడటం చాలా బాధగా ఉంది. ప్రతిసారీ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. అయినా మీరు నిరాశ చెందకండి. మీరు చేస్తున్న పనికి ఎంతో గౌరవం దక్కాలి” అని అన్నారు. బ్రెజిల్కు చెందిన ఓ వ్యక్తి మాత్రం చెత్తను శుభ్రం చేసే సమయంలో రక్షణ పరికరాలు ఉపయోగించాలని సూచించారు. “ఇలాంటి పనులు చేసేటప్పుడు ప్రత్యేకమైన బూట్లు, రక్షణ దుస్తులు ధరించండి. మీకు అంతా మంచే జరగాలి” అని కామెంట్ చేశారు.
చెత్త వేసేవారిపై చర్యలు
మరికొందరు నెటిజన్లు మాత్రం ఒక్క వ్యక్తి నదిని శుభ్రం చేసినంత మాత్రాన సమస్య పరిష్కారం కాదని అభిప్రాయపడ్డారు. చెత్త వేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. “మున్సిపల్ అధికారులను కలిసి ఇక్కడ చెత్త వేసేవారికి జరిమానాలు విధించేలా చూడండి. లేకపోతే మళ్లీ మళ్లీ ఇదే జరుగుతుంది” అని ఓ నెటిజన్ సూచించారు.
మరికొందరు ప్రజల నిర్లక్ష్యంపై అసహనం వ్యక్తం చేశారు. “ఈ ప్రజలు ఎప్పటికీ మారరు” అంటూ వ్యాఖ్యానించారు. అయితే అజ్నార్ నదిని శుభ్రం చేసేందుకు బిట్టు తబాహి చేస్తున్న ప్రయత్నాలు అభినందనీయమైన.. ప్రజల్లో బాధ్యత పెరగకపోతే నదులను శుభ్రంగా ఉంచడం కష్టమేనని ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది.
