మోసగించిన పార్టీలకు గుణపాఠం చెబుతం : జాజుల శ్రీనివాస్ గౌడ్

మోసగించిన పార్టీలకు గుణపాఠం చెబుతం : జాజుల శ్రీనివాస్ గౌడ్

బషీర్ బాగ్, వెలుగు:  అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీలు బీసీలను పూర్తిగా విస్మరించాయని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. జనాభా ప్రాతిపదికన టికెట్లు కేటాయించకుండా తీవ్ర అన్యాయం చేశాయని మండిపడ్డారు. ఈ ఎన్నికలు అగ్రకుల పార్టీలకు చివరివి అని, 2028లో జరిగే ఎన్నికల్లో తమ తడాఖా చూపించి బహుజన రాజ్యం సాధిస్తామన్నారు. ‘అసెంబ్లీ ఎన్నికలు‌‌‌‌‌‌‌‌– -బీసీల కర్తవ్యం’ పై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్ లక్డీకాపూల్ లోని ఓ ప్రవేటు హోటల్ లో బీసీల రాజకీయ మేథోమదన సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్  మాట్లాడుతూ..  బీఆర్ఎస్ లో  ఒకే కుటుంబం నుంచి ముఖ్యమంత్రులు అవుతారని, బీసీ సీఎం ఎప్పుడు అవుతారని ప్రశ్నించారు. బీసీలకు అన్యాయం చేసిన పార్టీల్లో బీఆర్ఎస్ ముందుందని, ఎన్నికల్లో బీసీలు తిరుగుబాటు చేసి సీఎం కేసీఆర్ ను గద్దె దించుతామని ఆయన హెచ్చరించారు.  పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గాంధీ భవన్ ను రెడ్డి భవన్ గా మార్చి గెలవని స్థానాల్లో బీసీలకు టికెట్లు ఇచ్చారని మండిపడ్డారు. 

 కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తానని రాహుల్ గాంధీ  ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. ఏనాడు కులాల సభలో పాల్గొనని ప్రధాని మోదీ మంగళవారం ఎల్​బీ స్టేడియంలో జరిగే బీసీ ఆత్మగౌరవ సభలో పాల్గొంటున్నారని,  ఈ ఘనత తమ సంఘానికే దక్కుతుందన్నారు. బీసీని ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటించిన బీజేపీ ప్రతిపాదనను స్వాగతిస్తామన్నారు. దామాషా ప్రకారం రిజర్వేషన్లు, కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు, బీసీ జనగణనపై స్పష్టమైన వైఖరి ప్రకటించాని జాజుల డిమాండ్ చేశారు.