అత్యంత బాధాకరం..హైదరాబాద్ అగ్నిప్రమాదంపై రాహుల్ గాంధీ

అత్యంత బాధాకరం..హైదరాబాద్ అగ్నిప్రమాదంపై రాహుల్ గాంధీ

హైదరాబాద్ అగ్నిప్రమాద ఘటనపై కాంగ్రెస్ నేత, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) స్పందించారు. ప్రమాదంలో ఎనిమిది మంది పిల్లలతో సహా 17 మంది చనిపోవడం అత్యంత బాధాకరం అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. 

మరోవైపు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge)ప్రమాదంపై ఆరాతీశారు. సీఎం రేవంత్‌రెడ్డికి ఫోన్ చేసి ప్రమాద ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం జరిగిన తీరును సీఎం ఆయనకు వివరించారు. ఎప్పటికప్పుడు సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. ఘటనాస్థలికి మంత్రులు వెళ్లినట్లు చెప్పారు.

ALSO READ | మీర్ చౌక్ ప్రమాదం: మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా

ఆదివారం (మే18) చార్మినార్ సమీపంలో గుల్జార్ హౌజ్(Gulzar House)లోని మొదటి అంతస్తులో షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగి భవనంలో ఉన్న చిన్నారులతో 17 మంది అగ్ని ఆహుతి అయ్యారు. గాయపడ్డవారిని చికిత్స కోసం ఉస్మానియా, యశోద (మలక్‌పేట),DRDO అపోలో ఆసుపత్రులకు తరలించారు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది. 

హైదరాబాద్ గుల్జార్ హౌజ్ అగ్ని ప్రమాదం ఘటనలో బాధిత కుటుంబాలకు ప్రధాని సానుభూతి తెలిపారు. ఒక్కో బాధిత కుటుంబానికి రూ.2లక్షలు, గాయపడ్డ వారికి రూ.50వేల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా బాధిత కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. ప్రమాదంపై సీఎం రేవంత్, కేబినెట్ మంత్రులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఒక్కో కుటుంబానికి రూ. 5లక్షల ఇస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.