ఖమ్మం సభలో రాహుల్ గాంధీ కీలక ప్రకటన.. నెలకు రూ. 4వేల పెన్షన్

ఖమ్మం సభలో  రాహుల్ గాంధీ కీలక ప్రకటన..  నెలకు రూ. 4వేల పెన్షన్

ఖమ్మంలో కాంగ్రెస్ నిర్వహిస్తున్న జనగర్జన బహిరంగ సభలో రాహుల్ గాంధీ కీలక ప్రకటన చేశారు.   కాంగ్రెస్ అధికారంలోకి వస్తే చేయూత పథకం కింద వృద్ధులకు, వితంతువులకు ప్రతినెల రూ, 4 వేల పెన్షన్ ఇస్తామని ప్రకటించారు. అంతేకాకుండా గిరిజనులందరికీ పోడు భూములు ఇస్తామని రాహుల్ తెలిపారు. తెలంగాణలో బీజేపీ లేదన్న రాహుల్ గాంధీ.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ , బీఆర్ఎస్ మధ్య పోటీ ఉంటుందని చెప్పారు. బీఆర్ఎస్ బీజేపీకి బీ టీమ్ అని ఆరోపించారు. 

రాష్ట్రంలో సీఎం  కేసీఆర్ చాలా అవినీతి చేశాడని,  దీని వెనుక మోడీ ఉన్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. మోడీ ఏ నిర్ణయం తీసుకున్న దానికి  కేసీఆర్ సపోర్ట్ చేస్తాడని ఆరోపించారు.  బీఆర్ఎస్ అంటే రిస్తేదార్ సమితి అని, బీజేపీ బంధువుల పార్టీ అని విమర్శించారు.   వచ్చే ఎన్నికల్లో బీజేపీ బీ టీమ్ బీఆర్ఎస్ ను ఈజీగా ఓడిస్తామని రాహుల్ వెల్లడించారు. తెలంగాణలో కూడా కర్ణాటక ఫలితాలు వస్తాయని రాహుల్ ధీమా వ్యక్తం చేశారు.  

కేసీఆర్ తెలంగాణను ఒక జాగీర్ గా , తానోక రాజులాగా అనుకుంటారని రాహుల్ గాంధీ విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో లక్షల కోట్ల అవినీతి జరిగిందని, మిషిన్ భగీరథ, కాకతీయలో కేసీఆర్ కుటుంబం వేలకోట్లు దోచుకుందని ఆరోపించారు. భూములను దోచుకోవడానికి ధరణిని తీసుకువచ్చారని చెప్పారు.  సమాజంలో అన్ని వర్గాల నుంచి కేసీఆర్ దొచుకున్నారని తీవ్ర విమర్శలు గుప్పి్ంచారు.  బీఆర్ఎస్  ను విభేధించి కాంగ్రెస్ లో చేరిన పొంగులేటిని రాహుల్ అహ్వానించారు.  కాంగ్రెస్  నుంచి వెళ్లిపోయిన వారంతా తిరిగి రావాలని కోరారు.  

అయితే రాహుల్ గాంధీ మాట్లాడుతుండగా ప్రజలు పీఎం పీఎం అంటూ నినాదాలు చేశారు. రాహుల్ గాంధీ కూడా కాసేపు ఆగాలని చెప్పినప్పటికీ వినలేదు .  పీఎం పీఎం అంటూ నినాదాలు మారుమ్రోగాయి.