రోడ్లు, ఎయిర్ పోర్టులు, పోర్టులు కొంతమంది చేతిలో బందీ అయ్యాయి : రాహుల్

రోడ్లు, ఎయిర్ పోర్టులు, పోర్టులు కొంతమంది చేతిలో బందీ అయ్యాయి : రాహుల్

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, టీఆర్ఎస్ ఒక్కటేనని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ డ్రామాలు ఆడుతుందని, ఈ విషయాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలని విమర్శించారు. ప్రధాని మోడీ లైన్ లోనే సీఎం కేసీఆర్ నడుస్తున్నారని తెలిపారు. పార్లమెంట్ లో బీజేపీ తీసుకొచ్చే ప్రతి బిల్లుకు టీఆర్ఎస్ మద్దతిచ్చిందన్నారు. కాంగ్రెస్ ఏదైనా అంశాన్ని లేవనెత్తితే మాత్రం.. టీఆర్ఎస్ సభ్యులు నినాదాలు చేస్తారన్నారు. ‘భారత్ జోడో యాత్ర’లో భాగంగా హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్డులో నిర్వహించిన బహిరంగ సభలో రాహుల్ మాట్లాడారు. కొవిడ్ సమయంలో కేంద్రం తీసుకున్న చర్యల వల్ల ఎంతో మందికి నష్టం వాటిల్లిందన్నారు.

కేవలం ఇద్దరు, ముగ్గురు పెట్టుబడిదారులకు లబ్ది చేకూర్చే విధంగా కేంద్రం ప్రయత్నిస్తోందన్నారు. రోడ్లు, ఎయిర్ పోర్టులు, పోర్టులు కొంతమంది చేతిలో బందీగా ఉన్నాయన్నారు. పెరుగుతున్న పెట్రోల్, గ్యాస్ ధరలపై ఇప్పుడు మోడీ ప్రస్తావించరని విమర్శించారు. చిన్నపాటి వ్యాపారస్తులు, రైతులకు రుణాలు దొరక్క ఎన్నో ఇబ్బందులు పడుతున్నారన్నారు. కానీ కొంతమంది పెద్దలు లోన్లు తీసుకుని ఎగ్గొట్టినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటన్నారు. దేశాన్ని విడగొట్టాలని.. మత విద్వేషాలు రెచ్చగొట్టాలని బీజేపీ ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తాము పాదయాత్ర చేపట్టాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. ఉన్నత చదువులు చదివిన వారికి ఉద్యోగాలు దొరకడం లేదన్నారు. విభిన్న మతాలకు చెందిన వాళ్లు సోదర భావంతో మెలగటం హైదరాబాద్‌ నగర ప్రత్యేకత అని రాహుల్ అభివర్ణించారు.