ఆయన వెంట జనం లేరు..దోచుకున్న ధనం, పోలీసులే ఉన్నరు

ఆయన వెంట జనం లేరు..దోచుకున్న ధనం, పోలీసులే ఉన్నరు
  • ఆయన వెంట జనం లేరు.. దోచుకున్న ధనం, పోలీసులే ఉన్నరు
  • టీఆర్​ఎస్​తో ఎట్టిపరిస్థితుల్లో పొత్తు ఉండదు
  • వచ్చే ఎన్నికల్లో టీఆర్​ఎస్​, కాంగ్రెస్​ మధ్యనే పోరు
  • మెరిట్​ ఆధారంగానే టికెట్లు ఇస్తం.. 
  • లీడర్లు మీడియాకెక్కొద్దు.. ఢిల్లీకి రావొద్దు
  • వరంగల్​ డిక్లరేషన్​ను జనంలోకి తీసుకెళ్లాలి
  • గాంధీభవన్​లో  కాంగ్రెస్​ నేతలతో సమావేశం 

కేసీఆర్ దగ్గర జనం నుంచి దోచుకున్న డబ్బు ఉంది. ఆయనతో పోలీసులున్నరు. అధికార యంత్రాంగం ఉంది. కానీ జనం లేరు. జనాన్ని మించిన శక్తి ఇంకేం ఉండదు. రాష్ట్రంలో వివిధ వర్గాల్లోని ప్రజల్లో కాంగ్రెస్​ సిద్ధాంతాన్ని నమ్మే వాళ్లున్నరు. వాళ్లందరికీ పార్టీ తలుపులు ఎప్పుడూ తెరిచే  ఉంటాయి. కాంగ్రెస్ ఆలోచనా విధానాన్ని ఇష్టపడే వాళ్లంతా పార్టీతో కలిసి వచ్చి టీఆర్​ఎస్​పై పోరాటంలో పాలుపంచుకోవాలి.
‑ రాహుల్​ గాంధీ

హైదరాబాద్​, వెలుగు: తెలంగాణను దోచుకుంటున్న కేసీఆర్​ను, టీఆర్​ఎస్​ పార్టీని తరిమేద్దామని, ఇందుకోసం తమతో కలిసిరావాలని యువతకు కాంగ్రెస్​ ముఖ్యనేత రాహుల్​గాంధీ పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఈ ప్రాంతవాసులకు ఒక కల ఉండేదని, దాన్ని కేసీఆర్​ వమ్ము చేశారని  ఆయన మండిపడ్డారు. ఇక్కడి యువత ఎనిమిదేండ్లుగా కలల సాకారం కోసం ఎదురుచూస్తున్నారని, చివరకు అవన్నీ కల్లలైపోయాయని అన్నారు. 

‘‘తెలంగాణను ఎట్లా లూటీ చేశారో, జనం జేబుల్ని ఎట్లా కొల్లగొట్టారో ఇక్కడి ప్రజలు ఎనిమిదేండ్లుగా చూస్తున్నరు. జనం ఆశించిన విద్య, వైద్యం, ఉపాధి ఏదీ వాళ్లకు అందలేదు. కానీ టీఆర్​ఎస్​లోని ఒక కుటుంబమే లాభపడింది” అని రాహుల్​ పేర్కొన్నారు. ఇప్పటికైనా మించి పోయింది లేదనీ, అందరూ కలిసి కట్టుగా టీఆర్​ఎస్​తో లడాయి చేద్దామని, ఆ కలలను నెరవేర్చుకునే రోజులు వస్తాయని చెప్పారు. అందుకోసం తాను తెలంగాణ ప్రజలకు అండగా ఉంటానని, వాళ్లతో కలిసి నడుస్తానని అన్నారు. శనివారం గాంధీభవన్​లో ఏర్పాటు చేసిన ప్రత్యేక విస్తృత కార్యవర్గ సమావేశంలో పార్టీ ముఖ్య నేతలు, ఎన్​రోలర్లను ఉద్దేశించి రాహుల్​గాంధీ మాట్లాడారు. ‘‘కాంగ్రెస్​కు నష్టం జరుగుతుందని తెలిసినా సోనియాగాంధీ మీకు తెలంగాణ ఇచ్చారు. మీతోనే మేమున్నాం. ఎందుకంటే మీ పోరాటంలో నిజాయితీ ఉంది. న్యాయం ఉంది. అందుకే మేం నాడు అండగా నిలిచాం. మీ కలలు నెరవేరలేదు. వాటిని నెరవేర్చుకునే వరకు పోరాటం చేద్దాం. కలిసి పనిచేద్దాం.. అది కాంగ్రెస్​ బాధ్యత’’ అని తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు. తన అవసరం ఎప్పుడున్నా, ఎక్కడున్నా వస్తానన్నారు. ‘‘కాంగ్రెస్​లోకి రండి, తెలంగాణను మార్చండి’’ అంటూ ఆహ్వానించారు. కేసీఆర్​ వద్ద దోచుకున్న డబ్బు ఉందని, పోలీసులు ఉన్నారని, జనం మాత్రం లేరని చెప్పారు. 

కొట్లాట టీఆర్​ఎస్​, కాంగ్రెస్​ మధ్యనే.. 

‘‘తెలంగాణకు ద్రోహం చేసిన వారితో ఎలాంటి పొత్తు ఉండదని నేను వరంగల్​ సభలో చెప్పాను. అదిఈ రోజే కాదు, రేపు కాదు, ఇంకెప్పుడూ ఉండదు” అని రాహుల్​ స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్​ఎస్​, కాంగ్రెస్​ మధ్యనే పోరు ఉంటుందని చెప్పారు. కాంగ్రెస్​లోని అందరూ కలిసి కట్టుగా పని చేయాలని, ప్రజలతో మమేకం కావాలని ఆయన పిలుపునిచ్చారు. నియంతృత్వ ప్రభుత్వం పోయి, రైతులు, యువకులు, కార్మికులు, పేదలు కలలుగన్న రాష్ట్రాన్ని తీర్చిదిద్దుకుందామన్నారు. ప్రజలకు విద్య, వైద్యం, ఉపాధిపై ఫోకస్​ పెట్టాలని, కాంగ్రెస్​ లక్ష్యం, స్వప్నం ఇవే కావాలని సూచించారు. 

పార్టీకి నష్టం చేస్తే ఉపేక్షించేది లేదు

తెలంగాణ ప్రజల కలల్ని నిజం చేయాలనుకుంటే కాంగ్రెస్​ నేతల్లో ముందుగా ఐక్యత అవసరమని రాహుల్​ అన్నారు. విభేదాలు ఉంటే నాలుగు గోడల మధ్య పరిష్కరించుకోవాలని, మీడియాకు ఎక్కవద్దని చెప్పారు. ‘‘కుటుంబంలో భిన్నాభిప్రాయాలు సహజం. వాటిన్నిటినీ వినేందుకు నేను సిద్ధం. మనది ఆర్​ఎస్​ఎస్​ కుటుంబం లాంటిది కాదు. అక్కడ ఒక వ్యక్తి అభిప్రాయాన్నే అందరి మీద రుద్దుతారు. ఏమైనా ఫిర్యాదులు, అభ్యంతరాలు ఉండే వాటిని చర్చించేందుకు కాంగ్రెస్​లో ఒక అంతర్గత వ్యవస్థ ఉంది. అక్కడ మాత్రమే వాటిని వ్యక్తీకరించాలి. అట్లా కాకుండా మీడియా ముందుకు వెళ్లారంటే పార్టీని నష్టపరుస్తున్నట్లే లెక్క. అలాంటి వారిని ఉపేక్షించేది లేదు” అని తేల్చిచెప్పారు. వరంగల్​లో అందరూ కలిసి పని చేశారని, అందుకే ఆ సభ సక్సెస్​ అయిందని అన్నారు.  వచ్చే ఎన్నికల్లో మెరిట్​ ఆధారంగానే టికెట్లు కేటాయిస్తామని రాహుల్​గాంధీ స్పష్టం చేశారు. హైదరాబాద్​లో కూర్చుంటే టికెట్లు రావని, ఎంత పెద్ద నేత అయినా, ఎన్నేండ్లుగా పార్టీలో ఉన్నా ప్రయోజనం లేదని, జనంలోకి వెళ్లి జనం కష్టసుఖాలు వింటూ, జనం తరఫున పోరాటం చేస్తేనే టికెట్లు వస్తాయన్నారు. క్షేత్ర స్థాయిలో సమాచారం తీసుకొని జనం కోరే వారికే టికెట్లు ఇస్తామన్నారు.

వరంగల్​ డిక్లరేషన్​ను జనంలోకి తీసుకుపోవాలి

తెలంగాణ ప్రజల ఆకాంక్షను పూర్తి చేసే క్రమంలో కాంగ్రెస్​ నేతలంతా వరంగల్​ డిక్లరేషన్​లోని అంశాలకు బాగా ప్రచారం కల్పించాలని రాహుల్​ చెప్పారు. అది డిక్లరేషన్​ కాదని, అది భవిష్యత్​ పట్ల భరోసా కల్పించే విశ్వాస పత్రం కావాలని.. రైతులకు, కాంగ్రెస్​కు మధ్య భాగస్వామ్యం ఒప్పంద పత్రం కావాలని అన్నారు. అందులోని అంశాలు ఆచరణ రూపం దాలుస్తాయనే నమ్మకం కలిగించే పత్రం కావాలన్నారు. దీని కోసం నేతలంతా రానున్న నెల రోజులు పని చేయాలని, రైతులకు వివరించి చెప్పాలని, ప్రజలందరికీ నమ్మకం కలిగేలా చూడాలన్నారు.