రైతులు ఆత్మహత్యలు చేస్కుంటున్నరు: రాహుల్​

రైతులు ఆత్మహత్యలు చేస్కుంటున్నరు: రాహుల్​
  • నిరుద్యోగులు గోస పడుతున్నరు 
  • పెద్ద చదువులు చదివినోళ్లు పిజ్జాలు డెలివరీ చేస్తున్నరు 
  • ధరణితో భూములను కేసీఆర్ గుంజుకుంటున్నరు 
  • పొల్యూషన్ లో ఢిల్లీ.. అవినీతిలో తెలంగాణ ఫస్టని విమర్శ 
  • కేసీఆర్.. ముందు రాష్ట్రం సంగతి చూస్కో: ఖర్గే 
  • ‘జోడో’ నినాదాలతో మోడీ, కేసీఆర్ గుండెలదరాలె: రేవంత్ 

 

 

హైదరాబాద్‌‌/శంషాబాద్​, వెలుగు:  
‘‘తెలంగాణలో ఏడు రోజుల యాత్రలో అనేక వర్గాల ప్రజలను కలిశా. ఎవరిని కదిలించినా సమస్యలతో కన్నీళ్లు పెడుతున్నారు. ఇక్కడి రైతుల కష్టాలను స్వయంగా తెలుసుకున్నా. సాగు లాభదాయకంగా లేక ఏటా వందలాది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. నిరుద్యోగులు కూడా గోస పడుతున్నారు. పెద్ద చదువులు చదివినా.. ఉద్యోగాలు లేక స్విగ్గి, జోమాటో వంటి కంపెనీల్లో డెలివరీ బాయ్స్ గా పని చేసుకుంటున్నారు. రాష్ట్రంలో రైతులకు, యువతకు భరోసా లేదు” అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. భారత్ జోడో యాత్రలో భాగంగా హైదరాబాద్‌‌లో నెక్లెస్‌‌రోడ్‌‌ లోని ఇందిరాగాంధీ విగ్రహం వద్ద మంగళవారం జరిగిన కార్నర్‌‌ మీటింగ్‌‌లో ఆయన మాట్లాడారు.

ఢిల్లీ పొల్యూషన్ లో ఫస్ట్ ఉంటే.. తెలంగాణ అవినీతిలో ఫస్ట్ ఉందన్నారు. ఇక్కడ రోడ్లు, ఇతర మౌలిక వసతులు కూడా సరిగ్గా లేవని ఈ యాత్రలో తెలిసిందన్నారు. సీఎం కేసీఆర్ కు ప్రజల సమస్యలను తెలుసుకునే, వినే ఓపిక లేదన్నారు. కేసీఆర్‌ దృష్టి అంతా ధరణి పోర్టల్‌ మీదే ఉంటుందని, ఆక్రమించిన భూములు ఎక్కడ ఉన్నాయో.. అని రోజూ రాత్రికి చెక్ చేసుకుంటూ ఉంటారని ఎద్దేవా చేశారు. కమీషన్లు లేనిదే కాంట్రాక్టులు ఇవ్వరన్నారు. హైదరాబాద్ ప్రజలు చూపిన ప్రేమ, ఉత్సాహం ఎప్పటికీ మరవలేనన్నారు. 

బీజేపీ, టీఆర్ఎస్ రెండూ ఒక్కటే 
బీజేపీ, టీఆర్ఎస్ రెండూ ఒక్కటేనని, ఎన్నికలు వచ్చినప్పుడు విమర్శలు చేసుకుంటూ ఆ 2పార్టీలు నాటకాలాడుతాయని రాహుల్ అన్నారు. సీఎం కేసీఆర్‌కు, ప్రధాని మోడీకి మధ్య డైరక్ట్ లైన్ ఉందని, కేసీఆర్‌ ఫోన్‌ చేసిన మరుక్షణమే మోడీ ఫోన్‌ లిఫ్ట్ చేస్తారన్నారు. పార్లమెంట్‌లో బీజేపీ ప్రవేశపెట్టిన ప్రతీ బిల్లుకు టీఆర్ఎస్ మద్దతు పలికిందని, ప్రతిపక్షం లేవనెత్తే అంశాలకు మాత్రం మద్దతీయలేదని చెప్పారు.ప్రధాని మోడీ ముగ్గురు పెట్టుబడిదారుల కోసమే పాలన సాగిస్తున్నారని రాహుల్ విమర్శించారు. టెలికాం, ఎల్‌ఐసీ, పోర్టులు, ఎయిర్‌ పోర్టులు, ప్రభుత్వ రంగ సంస్థలు, దేశ సంపద అంతా మోడీ తన ఇద్దరు ముగ్గురు మిత్రులకు కారుచౌకగా కట్టబెడుతున్నారని ఆరోపించారు. త్వరలో హైదరాబాద్ ఎయిర్ పోర్టు కూడా వాళ్ల చేతిలో పడవచ్చన్నారు. పెద్ద నోట్ల రద్దుతో, కరోనా సమయంలో జీఎస్టీతో చిరు వ్యాపారుల నడ్డిని మోడీ విరిచారని, కార్పొరేట్ కంపెనీల అప్పులను మాత్రం మాఫీ చేశారని విమర్శించారు. మోడీ తన స్నేహితులకు లక్షల కోట్లు దోచిపెడుతున్నారని, ఇదేనా అభివృద్ధి? అని ప్రశ్నించారు. 

పేదలు నలిగిపోతున్నరు 
దేశంలో, రాష్ట్రంలో ఒక పక్క నిరుద్యోగం, మరోపక్క ధరల పెరుగుదల మధ్య పేదలు నలిగిపోతున్నారని రాహుల్ అన్నారు. ఎనిమిదేండ్ల కిందట అప్పుడు వంట గ్యాస్ సిలిండర్‌ ధర రూ.400 ఉంటే ఇప్పుడు 1,100 అయిందన్నారు. పెట్రోల్ రేట్లు కూడా భారీగా పెరిగాయన్నారు. దేశంలో పెరుగుతున్న ధరలు, నిరుద్యోగం, హింస, విద్వేషాలకు వ్యతిరేకంగా బీజేపీ పాలన నుంచి విముక్తి కల్పించేందుకే భారత్‌ జోడో యాత్ర చేస్తున్నానని ఆయన స్పష్టం చేశారు. 

హింస, ద్వేషాలతో దేశం ముందుకెళ్లదు   
దేశంలో ప్రజల మధ్య బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ హింస, విద్వేషాలను పెంచుతున్నాయని రాహుల్ ఆరోపించారు. దేశాన్ని వీరి నుంచి కాపాడేందుకు భారత్‌ జోడో యాత్రను చేపట్టామన్నారు. ఏ శక్తీ ఈ యాత్రను ఆపలేదన్నారు. యాత్రలో విద్వేషాలు కనిపించవని చెప్పారు. అన్ని వర్గాలు, మతాలకు చెందిన యువత, మహిళలు యాత్రకు మద్దతు పలుకుతున్నారని, అందరూ కలిసి ముందుకు సాగుతున్న ఈ యాత్ర అసలైన భారతీయతకు నిదర్శనమన్నారు. 

కేసీఆర్.. ముందు రాష్ట్రం సంగతి చూస్కో: ఖర్గే 
వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్జే అన్నారు. దేశాన్ని, సమాజాన్ని రెండు వర్గాలుగా విభజించేందుకు ప్రధాని మోడీ ప్రభుత్వం, బీజేపీ, ఆర్ఎస్ఎస్ ప్రయత్నిస్తున్నాయని ఆయన ఆరోపించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గుర్తించి కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిందని, ప్రజలు కేసీఆర్ కు అధికారం ఇస్తే అభివృద్ధిని పక్కనపెట్టి భూములు గుంజుకుంటున్నారని మండిపడ్డారు. బెదిరింపులకు పాల్పడుతూ కేసులు పెడుతున్నారని, మోడీ, కేసీఆర్‌ ఇద్దరూ ఒక్కటేనన్నారు. సీఎం కేసీఆర్ ఇతర రాష్ట్రాలకు తిరగడానికి ముందు సొంత రాష్ట్రాన్ని సరిదిద్దడంపై దృష్టిపెట్టాలన్నారు.'

యువత కదం తొక్కుతున్నది: రేవంత్ రెడ్డి  
కృష్ణా నది పరవళ్లు తొక్కినట్లు తెలంగాణలో లక్షలాది మంది యువత రాహుల్‌గాంధీతో కలిసి కదం తొక్కి నడుస్తున్నరని పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి అన్నారు. రాహుల్ యాత్రలో పాల్గొనేందుకు కోట్లాది మంది వీధుల్లోకి వచ్చారని, దుర్మార్గులను పారద్రోలేందుకు కదం తొక్కుతామని నిరూపించారన్నారు. ‘‘జోడో జోడో.. భారత్‌ జోడో..” అనే నినాదాలతో సీఎం కేసీఆర్‌, ప్రధాని మోడీ గుండెలు అదరాలని, ఈ నినాదాలు ఢిల్లీని తాకాలన్నారు. రాహుల్‌కు అండగా నిలబడి బీజేపీ అరాచకాలను తుదముట్టించడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీఎల్‌పీ నేత భట్టి విక్రమార్క, పార్టీ జాతీయ నేతలు కేసీ వేణుగోపాల్‌, మాణిక్కం ఠాగూర్‌, రాష్ట్ర నేతలు జీవన్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సంపత్‌కుమార్‌, వీహెచ్, పొన్నాల లక్ష్మయ్య, బోసురాజు, తదితరులు పాల్గొన్నారు.  

రాష్ట్రంలో ఏడో రోజు యాత్ర సాగిందిలా..  
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర రాష్ట్రంలో ఏడో రోజు కొనసాగింది. శంషాబాద్ లో మంగళవారం ఉదయం 6 గంటలకు ప్రారంభమైన యాత్ర సాయంత్రం 6.30 గంటలకు నెక్లెస్ రోడ్డుకు చేరింది. అక్కడ కార్నర్ మీటింగ్ అనంతరం రాత్రికి బోయిన్ పల్లిలో బస చేసేందుకు రాహుల్ బయలుదేరారు. ఉదయం తొండుపల్లిలో ప్రారంభమైన యాత్ర శంషాబాద్, సిద్ధాంతి, సాతం రాయి, గగన్ పహాడ్, ఆరాంఘర్, పురానాపూల్, చార్మినార్, గాంధీ భవన్ మీదుగా కొనసాగింది. ఆరాంఘర్ వద్ద టీ బ్రేక్ తీసుకున్న రాహుల్.. మధ్యాహ్నం మీరాలం ట్యాంక్ లోని లెగసీ ప్యాలెస్ వద్ద లంచ్ బ్రేక్ తీసుకున్నారు. అక్కడ నేవీ మాజీ చీఫ్ అడ్మిరాల్ రామ్ దాస్ తో పాటు పలువురు ట్రాన్స్ జెండర్లతో మాట్లాడారు. సాయంత్రం చార్మినార్ కు చేరుకున్నారు. సద్భావన యాత్ర సందర్భంగా1990లో రాజీవ్ గాంధీ జాతీయ జెండాను ఆవిష్కరించిన చోట ఆయన చిత్రపటానికి రాహుల్ నివాళులు అర్పించారు. అక్కడి నుంచి పాదయాత్రగా నెక్లెస్​ రోడ్డుకి వెళ్లారు. 2016లో హెచ్ సీయూలో ఆత్మహత్య చేసుకున్న రోహిత్ వేముల తల్లి రాధిక శంషాబాద్ వద్ద భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీని కలిశారు. రాధికను ఆయన ఆప్యాయంగా పలకరించారు. రాహుల్ తో కలిసి ఆమె  కొద్దిసేపు నడిచారు. రోహిత్ వేముల తన హీరో అంటూ రాహుల్ కామెంట్ చేశారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ రాజ్యాంగంపై దాడి చేస్తున్నాయని, పార్లమెంటులో రోహిత్ చట్టం తీసుకురావాలని రాధిక కోరారు.