టీఆర్ఎస్, బీజేపీ రెండూ ఒక్కటే: రాహుల్

టీఆర్ఎస్, బీజేపీ రెండూ ఒక్కటే: రాహుల్

బీజేపీ, ఆర్ఎస్ఎస్ లు ప్రజల గొంతు నొక్కేస్తున్నాయని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఇది నిజమైన భారతదేశం కాదన్న ఆయన.. ప్రజల మధ్య హింస, విద్వేషాలను రేకెత్తిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ మండలం సోలీపూర్ చౌరస్తా వద్ద ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎండొచ్చినా, వానొచ్చినా.. భారత్ జోడో యాత్ర కాశ్మీర్ వరకు కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.   

తెలంగాణలో నిరుద్యోగం ఎక్కువగా ఉందని రాహుల్ గాంధీ అన్నారు. చదివిన చదువులకు తగిన ఉద్యోగాలు దొరకడం లేదన్నారు. జీఎస్టీ, నోట్ల రద్దు కారణంగా చిరువ్యాపారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన చెందారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే చేనేత రంగం పై విధించిన పన్నును సంబంధించిన పరిహారాన్ని తిరిగి చెల్లిస్తామని హామీ ఇచ్చారు. సీఎం కేసీఆర్ ధరణి పోర్టల్ పెట్టి నిరుపేదల భూములను లాక్కున్నారని విమర్శించారు. ధరణి పోర్టర్ రద్దు చేసి.. దళితుల భూములు తిరిగి వారికి ఇచ్చేస్తామని చెప్పారు. బీజేపీ ప్రవేశపెట్టే ప్రతి బిల్లుకు టీఆర్ఎస్ మద్దతు తెలుపుతోందన్నారు. ఎన్నికల సమయంలో బీజేపీ, టీఆర్ఎస్‭లు డ్రామాలు ఆడుతున్నాయన్న ఆయన.. రెండు పార్టీలు ఒక్కటేనని చెప్పారు. అక్రమంగా సంపాదించిన డబ్బులను ఓట్ల కోసం ఖర్చు పెడుతున్నారని మండిపడ్డారు.