
హైదరాబాద్ : అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత తొలిసారిగా రాష్ట్రానికి వస్తున్నారు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. మార్చి 9 వ తేదీన తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటించబోతున్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన కాంగ్రెస్ ప్రచారాన్ని రాహుల్ గాంధీ ప్రారంభిస్తారు. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో నిర్వహించబోయే బహిరంగ సభలో రాహుల్ గాంధీ పాల్గొంటారని కాంగ్రెస్ పార్టీ తెలిపింది. రాహుల్ గాంధీ బహిరంగ సభకు బూత్ కమిటీ కార్యకర్తలను ఆహ్వానించాలని నిర్ణయించింది. దాదాపు రెండు లక్షల మంది కార్యకర్తలతో మీటింగ్ ను ప్లాన్ చేస్తోంది కాంగ్రెస్.
చేవెళ్ల పార్లమెంట్ నియోజక వర్గ సమావేశాన్ని ఈ ఉదయం గాంధీభవన్ లో నిర్వహించారు పార్టీ నాయకులు. రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ కుంతియా, పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమ కుమార్, చేవెళ్ల పార్లమెంట్ నియోజక వర్గ నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.