న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) బిల్లుకు మద్దతు తెలిపే ముచ్చటే లేదని లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరోసారి తెగేసి చెప్పారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు డీలిమిటేషన్‌ను ముడిపెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన రాహుల్.. బిల్లు ఆమోదానికి సహకరించాలన్న కేంద్ర ప్రభుత్వం అభ్యర్థనను ఖరాఖండిగా తిరస్కరించారు.
రాహుల్ గాంధీతో కిరణ్ రిజిజు కీలక భేటీ
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో వరుసగా మూడో వారం కూడా ప్రతిష్టంభన కొనసాగుతోంది. నీట్ పేపర్ లీక్, విద్యార్థులపై పోలీసుల బల ప్రయోగం, అయోధ్య రామ మందిర విరాళాల చోరీ అంశాలపై చర్చకు విపక్షాలు పట్టుబడుతున్నాయి. ఇందుకు మోడీ సర్కార్ సానుకూలంగా లేకపోవడంతో పార్లమెంట్ ఉభయ సభలు సజావుగా సాగడం లేదు. మూడు వారాలుగా వాయిదాల పర్వం నడుస్తోంది. దీంతో పార్లమెంట్లో ప్రతిష్టంభనను తొలగించేందుకు బుధవారం (ఆగస్ట్ 5) పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు.
రాహుల్ గాంధీ చాంబర్లో దాదాపు 50 నిమిషాల పాటు జరిగిన ఈ భేటీలో పలు అంశాలపై చర్చించినట్లు తెలిసింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను తాము రాజీనామా చేయాలని కోరడం లేదని.. పార్లమెంట్‌కు వచ్చి విద్యార్థులపై పోలీసుల చర్యలకు సమాధానం చెప్పాలని మాత్రమే అడుగుతున్నామని రాహుల్ గాంధీ కిరణ్ రిజిజుకు స్పష్టంగా చెప్పినట్లు సమాచారం. అలాగే, రామ మందిరంలో జరిగిన విరాళాల చోరీ ఆరోపణలపై చర్చ చేపట్టాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేసినట్లు తెలిసింది.
అప్పటి వరకు సభ సజావుగా సాగదని కిరణ్ రిజిజుకు రాహుల్ గాంధీ క్లియర్ కట్‌గా చెప్పినట్లు సమాచారం. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తోన్న డీలిమిటేషన్ బిల్లుకు సహకరించాలని రాహుల్ గాంధీని కిరణ్ రిజిజు కోరినట్లు తెలిసింది. అయితే, కిరణ్ రిజిజు ప్రతిపాదనను రాహుల్ గాంధీ పూర్తిగా తిరస్కరించినట్లు సమాచారం. మహిళా రిజర్వేషన్ తో ముడిపెట్టిన డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని రాహుల్ తెగేసి చెప్పినట్లు టాక్.
