
దేశంలోని ప్రతీ పేదవాడికి కనీస ఆదాయం అందేలా పథకం తెస్తామన్నారు కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ. అధికారంలోకి వచ్చిన తర్వాత కనీస ఆదాయ పరిమితి నిర్ణయిస్తామని చెప్పారు. పరిమితికంటే తక్కువున్నవారికి.. మిగతా ఆదాయం కల్పిస్తామని హామీ ఇచ్చారు. కులం, మతం, భాష అనే పట్టింపు లేకుండా పేదలందరికీ కనీస ఆదాయ పథకం వర్తింప చేస్తామని చెప్పారు. ఆర్థిక నేరగాళ్లను పట్టుకుని.. ప్రజాధనాన్ని వసూలు చేసి.. ప్రతీ పేదవాడి బ్యాంక్ ఖాతాలో వేస్తామన్నారు రాహుల్. దేశభక్తి ముసుగులో.. విద్వేషాలు రెచ్చగొడుతున్నారు మోడీపై ఆగ్రహం వ్యక్తం చేశారు రాహుల్. పుల్వామా దాడి జరిగిన రోజు ప్రధాని షూటింగ్ లో పాల్గొన్నారన్నారు. ఉగ్రదాడి జరిగిందని తెలిసినా.. మూడున్నర గంటలు షూటింగ్ లో పాల్గొన్నారని.. ఇదేనా దేశభక్తి అంటే అని ప్రశ్నించారు. భారతదేశ సరిహద్దును ఆక్రమించేందుకు డోక్లాం దగ్గర చైనా తిష్టవేస్తే.. వివాదం పరిష్కరించకుండా.. చైనా అధ్యక్షుడితో చెట్టాపట్టాలేసుకు తిరగడమేనా దేశభక్తంటే అన్నారు రాహుల్.
సీఎం కేసీఆర్.. కీ.. మోడీ చేతిలో ఉందని విమర్శించారు రాహుల్. మోడీ నిర్ణయాలన్నింటికీ కేసీఆర్, టీఆర్ఎస్ ఎంపీలు మద్దతు పలికారని తెలిపారు. మోడీ మళ్లీ ప్రధాని కావాలని కేసీఆర్ కోరుకుంటున్నారని చెప్పారు. నోట్లరద్దు, గబ్బర్ సింగ్ ట్యాక్స్ లతో పేద ప్రజల్ని ఇబ్బంది పెట్టారని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పేదల పక్షాన నిలుస్తుందన్నారు రాహుల్. రాఫెల్ ఢీల్ లో 30 వేల కోట్ల అవినీతి జరిగిందన్నారు రాహుల్. మిగ్, మిరాజ్, సుఖోయ్ విమానాలు తయారు HALకు కాంట్రాక్ట్ ఇవ్వకుండా.. యుద్ధ విమానాల తయారీలో ఏమాత్రం అనుభవం లేని అనిల్ అంబానీ సంస్థకు కాంట్రాక్ట్ ఇవ్వడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. అధికారంలోకి రాగానే మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదించడంతో పాటు.. మహిళా రక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తామన్నారు రాహుల్.