వలస కార్మికుల రైల్వే టికెట్‌ చార్జీలపై కేంద్రం క్లారిటీ

వలస కార్మికుల రైల్వే టికెట్‌ చార్జీలపై కేంద్రం క్లారిటీ
  • కేంద్రం 85 శాతం, రాష్ట్రాలు 15 శాతం చెల్లిస్తాయని వెల్లడి

న్యూఢిల్లీ: వలస కార్మికులను తరలించేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక రైళ్లు 85 శాతం టికెట్ ఛార్జీలను సబ్సిడీ చేశాయని, మిగిలిన 15 శాతం రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లించాల్సి ఉంటుందని బీజేపీ స్పష్టం చేసింది. లాక్​డౌన్ కారణంగా చిక్కుకుపోయిన కూలీలు, కార్మికుల రైలు ప్రయాణ ఖర్చును కాంగ్రెస్ రాష్ట్ర యూనిట్లు భరిస్తాయని సోనియా గాంధీ ప్రకటించిన కొద్ది గంటల్లోనే బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా స్పందించారు. పీఎం కేర్స్ ఫండ్ కి రూ.151 కోట్లు విరాళంగా ఇచ్చిన రైల్వే శాఖ.. వలస కార్మికుల నుంచి టికెట్ చార్జీలు వసూలు చేయడంపై మండిపడుతూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్విట్టర్ లో ఫైర్ అయ్యారు. దీనికి పాత్రా సమాధానమిచ్చారు. “రాహుల్ గాంధీజీ.. దేశవ్యాప్తంగా ఏ రైల్వే స్టేషన్‌లోనూ టిక్కెట్లు విక్రయించబడవని కేంద్రం మార్గదర్శకాలు జారీ చేసింది. రైల్వే 85%, రాష్ట్ర ప్రభుత్వానికి 15% చెల్లించడానికి సబ్సిడీ ఇచ్చింది. ఇప్పటికే మధ్యప్రదేశ్ ప్రభుత్వం టికెట్ ఖర్చులను చెల్లిస్తోంది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలను కూడా అలాగే చేయమని చెప్పండి”అని ట్వీట్ చేశారు.

‘‘ రైల్వే మంత్రి పీయూష్ గోయల్ తో మాట్లాడాను. కేంద్ర ప్రభుత్వం 85 శాతం, రాష్ట్రాల ప్రభుత్వాలు 15 శాతం టికెట్ చార్జీలు చెల్లిస్తాయని చెప్పాను. దీనిపై రైల్వే నుంచి అఫీషియల్ ప్రకటన వస్తుంది. ఇప్పటి నుంచి వలస కార్మికులు ప్రత్యేక రైళ్లలో ప్రయాణించేందుకు ఎలాంటి డబ్బులు చెల్లించనవసరం లేదు. ఫ్రీగా వెళ్లొచ్చు’’ అని బీజేపీ ఎంపీ సుబ్రమన్యన్ స్వామి ట్వీట్ చేశారు.